విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు!ప్రతి చిన్నారికి విద్య అందాలి: డాక్టర్ సీ హెచ్ శ్రీనివాస్
నిజామాబాద్ : జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ యూనిట్–1 ఆధ్వర్యంలో విద్యార్థుల్లో విద్య పట్ల ఆసక్తిని పెంపొందించడం, సమాజంలో విద్యా చైతన్యాన్ని విస్తరించడం లక్ష్యంగా డిచ్పల్లిలోని ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో విద్యా విస్తరణ, అవగాహన కార్యక్రమం (ఔట్రీచ్ ప్రోగ్రామ్) నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ యూనిట్–1 ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సీ హెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో “తాలీమ్ సబ్ కే లియే – అందరికీ విద్య” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్య ప్రాముఖ్యత, బాలబాలికలకు సమాన విద్యావకాశాలు, వ్యక్తిత్వ వికాసం, విద్య ద్వారా సామాజిక అభివృద్ధి తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ సీ హెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్య ప్రతి చిన్నారి ప్రాథమిక హక్కు అని, విద్య ద్వారానే వ్యక్తిగత వికాసంతో పాటు సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సామాజిక, ఆర్థిక అసమానతలను తొలగించడంలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ముఖ్యంగా మైనారిటీలు, వెనుకబడిన వర్గాల విద్యార్థులు విద్యావకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. బాలికల విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి విద్యార్థి క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై క్రమశిక్షణతో చదువుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో విద్యా వ్యవస్థ అభివృద్ధికి మౌలానా అబుల్ కలాం చేసిన విశేష కృషిని విద్యార్థులకు తెలియజేశారు. విద్య అందరికీ అందుబాటులో ఉండాలనే ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. తెలంగాణ యూనివర్సిటీ మైనారిటీ సెల్ డైరెక్టర్ డాక్టర్ అబ్దుల్ ఖవి మాట్లాడుతూ విద్యతోనే ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవచ్చని, ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు విద్య పట్ల ఆసక్తిని కలిగించడంలో ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి విద్య ప్రాముఖ్యత, బాలికల విద్య, సమాన అవకాశాలు, క్రమశిక్షణ, ఉపాధ్యాయుల పట్ల గౌరవం, భవిష్యత్తు లక్ష్యాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులతో ప్రశ్నోత్తర కార్యక్రమం నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో విద్యా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జీబా నాజ్లీ, ఉపాధ్యాయులు మాధవి కుమారి, నస్రీన్ సుల్తానా, సయ్యద్ బుఖారీ, సంపత్ కుమార్, హలీమా బేగం, అయూబ్, అబ్దుల్ బిన్ మొహ్సిన్, లావణ్య, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మనోహర్, మనీష్, రేవంత్, విష్ణు, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


