ఎస్‌ఐఆర్‌లో భాగంగా డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితా విడుదల

ఎస్‌ఐఆర్‌లో భాగంగా డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితా విడుదల

సెప్టెంబర్‌ 16లోగా క్లెయిమ్స్‌, అభ్యంతరాలు దాఖలు చేయాలి,
అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు,
ఓటర్లు తప్పనిసరిగా డ్రాఫ్ట్‌ జాబితాను పరిశీలించాలి,
అక్టోబర్‌ 19న తుది ఓటర్ల జాబితా విడుదల, 
జిల్లా ఎన్నికల అధికారి& కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్,

నాగర్ కర్నూల్ :భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ సోమవారం విడుదల చేశారు. నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 910 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ప్రకటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల జాబితా అత్యంత కీలకమైనదని, అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, అనర్హమైన లేదా నిబంధనలకు విరుద్ధంగా నమోదైన ఓటర్ల వివరాలను గుర్తించి సరిచేయడమే ఎస్‌ఐఆర్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ఖచ్చితత్వం, పారదర్శకత, విశ్వసనీయతను పెంచే విధంగా సవరణ ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను సేకరించినట్లు, ప్రస్తుత ఓటర్ల జాబితా ఆధారంగా ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారం అందజేసి వివరాలను నమోదు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.  బీఎల్‌ఓలు సేకరించిన వివరాలను సంబంధిత రికార్డులతో సరిపోల్చి, ఎన్యూమరేషన్ ఫారాలు, క్షేత్రస్థాయి పరిశీలన, అందుబాటులో ఉన్న సమాచారాన్ని సమగ్రంగా పరిశీలించిన అనంతరం డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను రూపొందించినట్లు తెలిపారు.ఎస్‌ఐఆర్‌లో భాగంగా ప్రస్తుత ఓటర్ల వివరాలను 2002 నాటి ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ చేసే ప్రక్రియను కూడా నిర్వహించినట్లు, కుటుంబ సంబంధాలు, చిరునామాలు, ఇతర సంబంధిత సమాచారాన్ని పరిశీలించి ప్రస్తుత వివరాలతో సరిపోల్చినట్లు కలెక్టర్ తెలిపారు. 2026 జూన్ 10 నాటికి నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 880 పోలింగ్ కేంద్రాల్లో 7,31,632 మంది ఓటర్లు నమోదై ఉన్నారని కలెక్టర్ తెలిపారు.ఎస్‌ఐఆర్ ప్రక్రియ అనంతరం పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణతో వాటి సంఖ్య 910కి పెరిగిందని, ఆగస్టు 17న విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రకారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 6,18,592 మంది ఓటర్లు ఉన్నట్లు, 3,11,395 మంది పురుష ఓటర్లు, 3,07,182 మంది మహిళా ఓటర్లు, 15 మంది ఇతరులు, 579 సర్వీస్ ఓటర్లు ఉన్నాయని తెలిపారుఎస్‌ఐఆర్ సందర్భంగా 22,669 మంది ఓటర్లు మరణించినట్లు బీఎల్‌ఓల క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించి అధికారికంగా నమోదు చేసినట్లు చెప్పారు. అలాగే 18,260 మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించలేదని, మరో 20,396 మంది ఓటర్లు రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు లేదా నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఇతర అసెంబ్లీ నియోజకవర్గాలకు తమ ఓటు నమోదును మార్చుకున్నట్లు పరిశీలనలో వెల్లడైందని తెలిపారు. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాపై 2026 ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్స్‌, అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాపై వచ్చే క్లెయిమ్స్‌, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి పరిష్కరించిన అనంతరం 2026 అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ తెలిపారు.డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైన నేపథ్యంలో జిల్లాలోని ప్రతి ఓటరూ తమ పేరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని, పేరు మాత్రమే కాకుండా ఓటరు పేరు, తండ్రి/భర్త పేరు, వయస్సు, లింగం, చిరునామా తదితర వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో కూడా పరిశీలించుకోవాలని కలెక్టర్ సూచించారు.కుటుంబంలోని అర్హులైన ప్రతి సభ్యుడి పేరు జాబితాలో ఉందో లేదో పరిశీలించాలని, అర్హత ఉన్నప్పటికీ పేరు లేకపోతే వెంటనే సంబంధిత ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. వివరాల్లో తప్పులు ఉంటే నిర్ణీత విధానంలో సవరణకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.అర్హత ఉన్నప్పటికీ పేరు డ్రాఫ్ట్ జాబితాలో లేని వారు నిర్ణీత గడువులోగా క్లెయిమ్ దాఖలు చేసుకోవాలని, జాబితాలోని ఏదైనా నమోదుపై అభ్యంతరం ఉన్న వారు నిబంధనల ప్రకారం అభ్యంతరం దాఖలు చేయవచ్చని, చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా దరఖాస్తులు సమర్పించాలని ప్రజలను కోరారు.డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలోని ఏదైనా నమోదుపై అభ్యంతరం వచ్చినప్పుడు సంబంధిత వ్యక్తులకు ఎన్నికల నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేస్తామని కలెక్టర్ తెలిపారు. నోటీసులు అందుకున్న వారు తమ అర్హతకు సంబంధించిన వివరాలు, అవసరమైన ఆధారాలను సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. సమర్పించిన ఆధారాలను నిబంధనల ప్రకారం పరిశీలించిన అనంతరం తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతంగా పూర్తిచేయడంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సహకారం ఎంతో ముఖ్యమని కలెక్టర్ పేర్కొన్నారు. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల, క్లెయిమ్స్‌, అభ్యంతరాల గడువు, దరఖాస్తు విధానం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.అర్హులైన ఓటర్ల పేర్లు డ్రాఫ్ట్ జాబితాలో లేకపోతే గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ నిర్ణీత గడువులోగా క్లెయిమ్ దాఖలు చేసేలా సహకరించాలని కోరారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి పక్షపాతం లేకుండా పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు అందేలా చూడటంతో పాటు, ఓటర్ల జాబితా విశ్వసనీయతను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలనిసూచించారు.ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కు అని కలెక్టర్ అన్నారు. ఓటర్ల జాబితాలో తమ పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, చిరునామా తదితర వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు.నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలో అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే క్లెయిమ్స్‌, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి పరిష్కరించిన అనంతరం తుది ఓటర్ల జాబితానురూపొందిస్తామని జిల్లా ఎన్నికల అధికారి& కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ స్పష్టం చేశారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి. చెన్నయ్య, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రవి కుమార్, ఎన్నికల డిటీ కల్పన, భారతీయ జనతా పార్టీ తరపున నాగేందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ తరపున, ఎండి హబీబ్, రాజేందర్, చింతల రాజ్ గోపాల్, వైయస్సార్సీపి నుండి ఎండి హుస్సేన్, టిడిపి పార్టీ నుండి డి బాలకృష్ణ, బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా నరసింహ, విష్ణు, సిపిఎం పార్టీ తరఫున పర్వతాలు, అశోక్, తదితరులు ఉన్నారు. 
Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వం బాధ్యత వహించాలి... మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి. ప్రభుత్వం బాధ్యత వహించాలి... మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి.
పాపన్నపేట.: ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యంతో పాపన్నపేట గ్రామపంచాయతీ కారోబార్ ఆకుల కృష్ణ ప్రాణం పోయిందని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి కుటుంబాన్ని ఆదుకోవాలని మెదక్...
ఎస్‌ఐఆర్‌లో భాగంగా డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితా విడుదల
హుస్నాబాద్ నియోజకవర్గ ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురణ
ప్రజావాణి కి 13 ఫిర్యాదులు
బిజెవైఏం ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాల యం ఎదుట వందేమాతారం గీతాలాపన....
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించాలి
ధర్మారెడ్డిపల్లి రైల్వే బ్రిడ్జి రోడ్డును వెంటనే మరమ్మతు చేయాలి