కురుమూర్తి క్షేత్రంలో నేడు ఉద్దాల ఉత్సవం.. భక్తజన సందోహం!
గోవింద నామస్మరణతో మార్మోగనున్న కురుమూర్తి కొండలు.. ఉద్దాల ఉత్సవానికి సర్వం సిద్ధం!
నాగర్కర్నూల్ : పాలమూరు పేదల తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన కురుమూర్తి క్షేత్రంలో వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన ఉద్దాల ఉత్సవం నేడు జరగనుంది. దీంతో కురుమూర్తి క్షేత్రం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోనుంది.
వడ్డేమాన్ గ్రామం నుంచి కురుమూర్తి క్షేత్రానికి స్వామివారి పాదుకల తరలింపు నేడు జరుగుతుంది. ఉద్దాల ఉత్సవాన్ని తిలకించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఉద్దాల ఉత్సవానికి సుమారు నాలుగు లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు.దీపావళి అనంతరం వడ్డేమాన్ గ్రామానికి చెందిన ఐదు కుటుంబాలు సంప్రదాయబద్ధంగా ఉద్దాల తయారీని ప్రారంభించాయి. రాయలసీమ నుంచి తెప్పించిన ప్రత్యేక తోలుతో ఏడు రోజుల పాటు నిష్టతో ఉద్దాలను తయారు చేశారు. ప్రత్యేక చాటలో ఉద్దాలను ఉంచి మేదరుల ఆధ్వర్యంలో వడ్డేమాన్ నుంచి కురుమూర్తికి ఊరేగింపుగా తరలిస్తారు. ఉద్దాల ఊరేగింపు సందర్భంగా పాదుకలను తాకేందుకు భక్తులు పోటీపడుతారు.రాత్రి జాతర మైదానంలో ఉద్దాల ఊరేగింపు జరిగిన అనంతరం కొండపై ఉన్న ఉద్దాల మండపానికి తరలిస్తారు. ముందుగా ఉద్దాలకు మొక్కులు చెల్లించుకున్న అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు.
ఏడు కొండలపై వెలసిన స్వయంభూ వేంకటేశ్వర స్వామి మీసాల వేంకటేశ్వరుడిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. శ్వేతాద్రి, దుర్గాద్రి, ఘనాద్రి, భల్లుకాద్రి, పతకాద్రి, దేవతాద్రి కొండలతో కురుమూర్తి క్షేత్రం విరాజిల్లుతోంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి సంప్రదాయ బంగారు ఆభరణాలతో అలంకరణ చేశారు. 15వ శతాబ్దంలో రాజా సోంభూపాల్ చేయించిన బంగారు కిరీటం, శంఖు, చక్రాలు, మకర కుండలాలతో స్వామివారిని అలంకరించారు.
భక్తులు స్వామివారికి దాసంగాలు సమర్పించడం కురుమూర్తి క్షేత్ర ప్రత్యేక సంప్రదాయం. అన్నం, పచ్చిపులుసు, భక్షాలను మట్టి కుండల్లో తయారుచేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. జాతర పరిసరాల్లో అదనపు పోలీసు బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.ఆలయ అభివృద్ధికి ఇప్పటికే రూ.110 కోట్ల నిధులు తీసుకొచ్చామని ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి వెల్లడించారు. దర్శనానికి కారిడార్ రోడ్డు పనులు, రూ.38 కోట్లతో మంచినీటి సదుపాయం కల్పించినట్లు తెలిపారు. మరో రూ.100 కోట్ల నిధుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టామని ఆలయ చైర్మన్ బత్తుల బాలరాజ్ తెలిపారు.హైదరాబాద్, కర్నూలు తదితర ప్రాంతాల నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో కురుమూర్తికి చేరుకునే సౌకర్యం ఉంది. ప్రస్తుతం భక్తుల గోవింద నామస్మరణతో కురుమూర్తి క్షేత్రం మార్మోగుతోంది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


