సొంత గడ్డపై సీఎం దసరా సందడి.. కొండారెడ్డిపల్లిలో వైభవంగా విజయదశమి వేడుకలు
కొండారెడ్డిపల్లె(నాగర్ కర్నూల్):నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్వగ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి విజయదశమి వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో కొండారెడ్డిపల్లికి చేరుకున్న సీఎంకు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ జీపులో గ్రామంలో పర్యటించిన సీఎంకు డప్పు చప్పుళ్లు, గజమాలలు, పూల జల్లులతో స్వాగతం పలికారు. మహిళలు సంప్రదాయ బతుకమ్మలతో స్వాగతం తెలిపారు. చిన్ననాటి మిత్రులు, గ్రామ పెద్దలు, స్థానికులతో సీఎం ఆత్మీయంగా పలకరించారు. అనంతరం కొండారెడ్డిపల్లిలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వేద మంత్రోచ్ఛారణల నడుమ ఆశీర్వచనాలు అందించారు. అనంతరం కొట్ట మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, విజయదశమి సందర్భంగా జమ్మి చెట్టుకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాల కోసం స్వామివారిని ప్రార్థించారు. తెలంగాణ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం, ప్రతి కుటుంబంలో శాంతి, సౌభాగ్యం, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. సీఎం పర్యటనతో కొండారెడ్డిపల్లి పండుగ శోభను సంతరించుకుంది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


