నల్లగొండలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం:
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ చంద్ర శేఖర్,ఎస్పీ శరత్ చంద్ర పవార్.
నల్లగొండ: నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.దేశ రక్షణ కోసం,ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులకు జిల్లా కలెక్టర్ చంద్ర శేఖర్,జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, అమరవీరుల కుటుంబ సభ్యులు,అధికారులు ఘనంగా నివాళులర్పించారు.ఉదయం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి,రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పోలీస్ బ్యాండ్ గౌరవ వందనం సమర్పించింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్ర శేఖర్ మాట్లాడుతూ ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు పోలీస్ శాఖ అందిస్తున్న సేవలు ఎంతో కీలకమని అన్నారు.శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు అనేక సవాళ్లను ఎదుర్కొంటూ నిరంతరం విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు."విధి నిర్వహణలో ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల ధైర్యం, కర్తవ్యనిష్ఠ,అంకితభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శం.నేరాల నియంత్రణ,మహిళలు, బాలల భద్రత,రోడ్డు ప్రమాదాల నివారణ,సైబర్ నేరాలపై అవగాహన,మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయం. అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని యువత దేశభక్తి,క్రమశిక్షణ, సేవాభావాన్ని అలవర్చుకోవాలి"అని కలెక్టర్ పిలుపునిచ్చారు.జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ పోలీస్ విధి కేవలం ఉద్యోగం మాత్రమే కాదని,ప్రజల పట్ల బాధ్యత, దేశం పట్ల నిబద్ధతతో కూడిన పవిత్రమైన కర్తవ్యమని అన్నారు."1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో చైనా సైనికుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పది మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది వీరమరణానికి గుర్తుగా ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాము.నల్లగొండ జిల్లాలో విధి నిర్వహణలో ఇప్పటివరకు 15 మంది పోలీస్ అధికారులు,సిబ్బంది అమరులయ్యారు.దేశవ్యాప్తంగా ఈ ఏడాది 154 మంది పోలీస్ అధికారులు,సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేశారు.వారి త్యాగాలు ఎప్పటికీ మరచిపోలేనివి"అని ఎస్పీ తెలిపారు.అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని,వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్,డీఎస్పీ కె.శివరాం రెడ్డి,ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్,సీఐలు,ఆర్ఐలు, ఎస్ఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది,పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


