బెల్లంపల్లిలో వైభవంగా రావణాసుర వధ
తిలక్ స్టేడియంలో అంబరాన్నంటిన విజయదశమి సంబరాలు మంత్రి వివేక్, ఎమ్మెల్యే వినోద్ హాజరు
బెల్లంపల్లి మంచిర్యాల : చెడుపై మంచి విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి వేడుకలు బెల్లంపల్లి పట్టణంలో ఘనంగా జరిగాయి. పట్టణంలోని తిలక్ స్టేడియం మైదానంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రావణాసుర వధ కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రావణాసురుడి ప్రతిమను దహనం చేయడంతో మైదానంలో పండుగ సందడి నెలకొంది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, మంత్రి సతీమణి గడ్డం సరోజన హాజరయ్యారు. రావణాసురుడి ప్రతిమ దహన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి మాట్లాడుతూ.. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి విజయదశమి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో ఈ పండుగకు విశిష్ట స్థానం ఉందన్నారు. రావణాసుర వధ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన హిందూ ఉత్సవ సమితి నిర్వాహకులను అభినందించారు.దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. బెల్లంపల్లి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దావ స్వాతి రమేష్‌బాబు, వైస్ చైర్మన్ రాగంశెట్టి సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రత్నం సుకుమారి, మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మాజీ వైస్ చైర్మన్ సుదర్శన్, కౌన్సిలర్ నాతరి స్వామి, ఇతర కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


