అర్హులందరికీ చేయూత పింఛన్లు - కష్టాల్లో ఉన్న కుటుంబాలకు రూ.5 లక్షల బీమా భరోసా : మంత్రి సీతక్క
ములుగు, : అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్ అందించి నిరుపేదల జీవితాల్లో ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. బుధవారం గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ క్రాస్ వద్ద చల్వాయి ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో మంత్రి 186 మంది లబ్ధిదారులకు చేయూత పింఛన్ మంజూరు పత్రాలు అందజేశారు. ఇందులో గోవిందరావుపేట మండలానికి చెందిన 88 మంది, ఏటూరునాగారంకు చెందిన 27 మంది, ములుగుకు చెందిన 40 మంది, వెంకటాపూర్‌కు చెందిన 9 మంది, తాడ్వాయికి చెందిన 22 మంది ఉన్నారు. అనంతరం గోవిందరావుపేట మండలానికి చెందిన 15 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జిల్లాలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందిస్తామని చెప్పారు. తలసేమియా బాధితులకు కూడా పింఛన్లు ఇచ్చి ఆ కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. పింఛన్లు ఒకేసారి అందరికీ మంజూరు కాకపోయినా దశలవారీగా అర్హులందరికీ అందిస్తామని భరోసా ఇచ్చారు. ఏ సంక్షేమ పథకాన్ని నిలిపివేయబోమని స్పష్టం చేశారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణించినప్పుడు ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఆదుకునేందుకే ఈ పథకమని చెప్పారు. జిల్లాలో అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, డీఆర్డీఓ చంద్రశేఖర్, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, అధికారులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


