మెదక్ రూరల్ పరిధిలోని అవుసులపల్లిలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
90 మంది పోలీసులతో తనిఖీలు.. 75 వాహనాలు స్వాధీనం
నార్కోటిక్ డాగ్ జూబి, ఫింగర్‌ప్రింట్ డివైజ్‌తో ప్రత్యేక తనిఖీలు
చిన్న దూరమైనా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి: అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్
మెదక్ : నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అవుసులపల్లి గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో 90 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 69 ద్విచక్ర వాహనాలు, 2 బొలెరోలు, 4 ఆటోలను కలిపి మొత్తం 75 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్ల మాయమాటలకు మోసపోవద్దని, ఓటీపీలు, బ్యాంకు వివరాలను అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారుల మరణాలకు హెల్మెట్ ధరించకపోవడం ప్రధాన కారణాల్లో ఒకటని తెలిపారు. చిన్న దూరమైనా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ స్ట్రాప్ బిగించుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. మహిళలు, బాలికల రక్షణకు సంబంధించిన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మైనర్ బాలిక అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకున్నప్పటికీ పోక్సో చట్టం ప్రకారం నేరమేనని స్పష్టం చేశారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. బాలికల రక్షణ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అత్యవసర సమయాల్లో పోలీసుల సహాయం కోసం డయల్ 112కు కాల్ చేయాలని, ఈ సేవలను అనవసరంగా దుర్వినియోగం చేయరాదని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు VPO ఏఎస్ఐ విఠల్ సేవలు అందిస్తారని పేర్కొన్నారు.
నార్కోటిక్ డాగ్ జూబి సహాయంతో ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో మాదకద్రవ్యాల ఉనికిని గుర్తించేందుకు తనిఖీలు నిర్వహించారు. ఫింగర్‌ప్రింట్ డివైజ్ ద్వారా వేలిముద్రలను పరిశీలించి పాత నేరస్థుల వివరాలను గుర్తించే ప్రక్రియ చేపట్టారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించడం పోలీసుల ఉద్దేశం కాదని, ప్రజల భద్రత, నేరాల నియంత్రణ కోసమే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అదనపు ఎస్పీ స్పష్టం చేశారు. నేరాల నియంత్రణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ తనిఖీల్లో డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐలు మహేష్, కృష్ణమూర్తి, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


