చౌటకూర్‌లో జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై మొరం పనులు.. అనుమతులపై సందేహాలు...!
రాత్రివేళల్లో మొరం పనులు నిర్వహిస్తున్న ఎస్‌ఎల్‌ఎన్ గ్రూప్.. అధికారుల అనుమతులు ఉన్నాయా....?
చౌటకూర్ : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి-161 సర్వీస్ రోడ్డుపై రాత్రివేళల్లో మొరం పనులు నిర్వహిస్తున్న వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎస్‌ఎల్‌ఎన్ గ్రూప్‌నకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఈ పనులు చేపడుతున్నట్లు సమాచారం. ఈ పనులకు సంబంధించి తమకు అనుమతులు ఉన్నాయని నిర్వాహకులు చెబుతున్నప్పటికీ, ఇప్పటివరకు సంబంధిత శాఖల నుంచి ఎలాంటి అనుమతులు పొందారనే దానిపై స్పష్టత లేకపోవడం గమనార్హం.రాత్రి వేళల్లో రోడ్లపై మొరం పోయడం వల్ల ప్రయాణించే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, ఎస్‌ఎల్‌ఎన్ గ్రూప్ చేపడుతున్న ఈ పనులకు నిజంగానే అధికారిక అనుమతులు ఉన్నాయా? నిబంధనల ప్రకారమే పనులు జరుగుతున్నాయా? అనే అంశాలపై విచారణ చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


