వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా ఎదగాలి
కొత్తగూడెం ఏరియా సేవా అధ్యక్షురాలు సీహెచ్. గీతారాణి వెంకటరమణ
కొత్తగూడెం బ్యూరో : మహిళలు వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదగాలని సింగరేణి కొత్తగూడెం ఏరియా సేవా అధ్యక్షురాలు సీహెచ్. గీతారాణి వెంకటరమణ పిలుపునిచ్చారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా సేవా సమితి ఆధ్వర్యంలో రుద్రంపూర్ మహిళలకు ఉచిత టైలరింగ్, రామవరం మహిళలకు ఉచిత ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్స్, గౌతంపూర్ మహిళలకు ఉచిత బ్యూటీషియన్ శిక్షణ తరగతులను సోమవారం రుద్రంపూర్ సీఈఆర్ క్లబ్‌లో ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సింగరేణి ఉద్యోగుల కుటుంబాలకు చెందిన మహిళలు, ప్రాజెక్టు ప్రభావిత ప్రాంతాలు, పరిసర ప్రాంతాల మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయడమే సేవా సమితి ప్రధాన లక్ష్యమన్నారు. ఇందులో భాగంగానే వివిధ వృత్తి విద్యా కోర్సులను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మూడు నెలల పాటు కొనసాగే ఈ శిక్షణ తరగతులకు మహిళలు క్రమం తప్పకుండా హాజరై నైపుణ్యాలను నేర్చుకోవాలని, శిక్షణను పూర్తి చేసుకొని స్వయం ఉపాధి ద్వారా అభివృద్ధి సాధించాలని సూచించారు. అనంతరం 2025-26 ఆర్థిక సంవత్సరంలో శిక్షణ పొందిన మహిళా లబ్ధిదారులకు సేవా అధ్యక్షురాలు గీతారాణి వెంకటరమణ చేతుల మీదుగా శిక్షణ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. అలాగే నూతనంగా శిక్షణ పొందుతున్న మహిళలకు ప్రోత్సాహకంగా పార్వతి మదన్మోహన్ ఒక మగ్గం స్టాండ్‌ను ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో డీవైపీఎం జి. హరీష్, సీనియర్ పీవో ఎం. మురళి, సేవా కోఆర్డినేటర్ సీహెచ్. సాగర్, సేవా కార్యదర్శి అనిత, శిక్షకులు, సేవా సభ్యులు, శిక్షణకు హాజరైన మహిళలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


