డబ్బులు రెట్టింపు చేస్తామని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తుల పై మావల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు, ఒక్కరి అరెస్ట్.*మావల ఇన్స్పెక్టర్ ప్రేమకుమార్
ఒకే తరహాలో 16 మందికి పైగా బాధితులను మోసం చేసినట్లు ఫిర్యాదు
ఫోన్ పే, గూగుల్ పే ద్వారా నగదు బదిలీ చేయించుకుని పరారైన నిందితులు
ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో డబ్బులు రెట్టింపు చేస్తామని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మావల పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ బి.డి. ప్రేమ్ కుమార్ తెలిపారు.
భగత్‌సింగ్ నగర్‌కు చెందిన గణేష్ అనే వ్యక్తి గతంలో కామారెడ్డి సమీపంలో విజయ్, రేఖ, బాలాజీ అనే వ్యక్తుల వద్ద రూ.15,000 తీసుకోగా, మూడు నెలల తర్వాత రెట్టింపు నగదు ఇస్తామని వారు నమ్మించారు. అనంతరం జనవరి 28న లక్ష్మి, విజయ్, రేఖ, బాలాజీ అనే నలుగురు వ్యక్తులు భగత్‌సింగ్ నగర్‌కు వచ్చి రూ.30,000 తీసుకున్నారు. అదనంగా మరో రూ.30,000 చెల్లిస్తే అదే రోజు రూ.1,00,000 తిరిగి ఇస్తామని నమ్మించడంతో బాధితుడు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా రూ.30,000 బదిలీ చేశాడు.
అనంతరం నిందితులు భోజనం చేసి వస్తామని చెప్పి అంబేద్కర్ చౌక్‌లోని బావర్చి హోటల్‌కు వెళ్లి, భోజనం అనంతరం ఇన్నోవా కారులో పరారయ్యారు. ఈ క్రమంలో నిందితులకు చెందిన వివో మొబైల్ ఫోన్ హోటల్ వద్ద మరిచిపోయి వెళ్లారు. ఆ ఫోన్‌లో నిందితుల ఫోటోలు ఉన్నట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారూ. ఇదే తరహాలో మరో 16 మందిని కూడా మోసం చేసినట్లు బాధితుడు ఫిర్యాదు చేయగా, నిందితులు ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు.
ఈ ఘటనపై మావల పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 57/2026, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 318(4) రెడ్‌విత్ 3(5) ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.
నిందితుల వివరాలు:
1. లక్ష్మి – పరారీలో ఉంది.
2. విజయ్ @ దాసరి రాజు, తండ్రి గంగారం, వయస్సు 31 సంవత్సరాలు, నివాసం చైతన్య కాలనీ, బాన్సువాడ, కామారెడ్డి జిల్లా.
3. రేఖ – పరారీలో ఉంది.
4. బాలాజీ – కామారెడ్డి జిల్లా, పరారీలో ఉన్నాడు.
ప్రజలు డబ్బులు రెట్టింపు చేస్తామని, తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని చెప్పే వ్యక్తుల మాటలను నమ్మి నగదు బదిలీ చేయవద్దని, ఇటువంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మావల పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ బి.డి. ప్రేమ్ కుమార్ సూచించారు. ఎవరైనా సైబర్ లేదా ఆర్థిక మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు సమాచారం అందించాలని తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

