కోయిలకొండ మండలంలో దారుణం.. చింతల్ తాండాలో మహిళ హత్య!
భూవివాదమే హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ
నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
కోయిలకొండ : కోయిలకొండ మండల పరిధిలోని చింతల్ తాండాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాండాకు చెందిన సునీత (26) అనే వివాహిత దారుణ హత్యకు గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మృతురాలు సునీత భర్త బలరాం కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేక హైదరాబాద్లోనే ఉంటున్నాడు. దీంతో సునీత తన ఇద్దరు ఆడపిల్లలతో కలిసి చింతల్ తాండాలోనే నివాసంటూ జీవనం సాగిస్తోంది.
సునీత పేరు మీద 1.20 గుంటల భూమి ఉంది. ఈ భూమిని తమ పేరుపై రాయాలని, లేదంటే ఆ భూమిని నీకు దక్కనీయమంటూ ఆమె భర్త తరఫు బంధువులు కొంతకాలంగా హెచ్చరిస్తూ, తరచూ వేధింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం. ఈ భయంతోనే ఆమె కాలం వెళ్లదీస్తోంది. ఈ నేపథ్యంలోనే కక్షగట్టిన కొందరు పదునైన కత్తులతో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేయడంతో సునీత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ హత్యకు కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాణిక్య నాయక్, మన్యా నాయక్, పాండు నాయక్ మరియు పార్వతిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలు తండ్రి వాల్యా నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు సీఐ గాంధీ నాయక్, ఎస్సై నాగరాజు వెల్లడించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

