జీవో 76 పట్టాలపై రీసర్వే మొదలు
బెల్లంపల్లి (మంచిర్యాల జిల్లా) : సింగరేణి ప్రాంతంలో ఇళ్ల పట్టాల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు మరోసారి ఆశలు చిగురిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జీవో నంబర్ 76 కింద బెల్లంపల్లి పట్టణంలో సుమారు 3 వేల నుంచి 4 వేల మందికి ఇళ్ల పట్టాలు మంజూరైనప్పటికీ, వివిధ కారణాలతో పంపిణీ ప్రక్రియ పూర్తికాలేదు. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని ప్రస్తావించడంతో రెవెన్యూ అధికారులు రీసర్వే చేపట్టారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి నివాసితుల వివరాలు సేకరిస్తున్నారు. అయితే సింగరేణి క్వార్టర్లు, సంస్థకు చెందిన స్థలాల్లో నివసిస్తున్న వారు యాజమాన్యం నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) పొందాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో పట్టాల మంజూరుపై మళ్లీ సందిగ్ధత నెలకొంది. ఏళ్లుగా అక్కడే నివాసముంటున్న పేద కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. రెవెన్యూ, సింగరేణి అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఎన్ఓసీ నిబంధనపై స్పష్టత ఇవ్వాలని ప్రజలు, ప్రజాసంఘాలు కోరుతున్నాయి. అర్హులైన నిరుపేదలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇళ్ల పట్టాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


