మహిళలు వృత్తి నైపుణ్యాలతో ఆర్థికంగా ఎదగాలి
మూడు నెలల ఉచిత వృత్తి శిక్షణ తరగతులు ప్రారంభించిన సింగరేణి సేవా సమితి
టైలరింగ్, మగ్గం వర్క్స్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్‌లో శిక్షణ
శిక్షణ పూర్తి చేసిన వారికి ఖాదీ గ్రామోద్యోగ్ మహా విద్యాలయం సర్టిఫికెట్లు
కొత్తగూడెం బ్యూరో : మహిళలు వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఆర్థికంగా ఎదగాలని సింగరేణి జీఎం (పర్సనల్) వెల్ఫేర్, సీఎస్‌ఆర్ అండ్ సెక్యూరిటీ కే. అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. సింగరేణి కార్పొరేట్ ఏరియాలో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలకు మూడు నెలల పాటు నిర్వహించనున్న ఉచిత వృత్తి శిక్షణ తరగతులను మంగళవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పాత కొత్తగూడెం మహిళలకు టైలరింగ్, బర్లిపిట్ మహిళలకు మగ్గం వర్క్స్, గాజులరాజం బస్తీ మహిళలకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్‌లో శిక్షణ అందించనున్నారు.
ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఉద్యోగుల కుటుంబ మహిళలతో పాటు ప్రాజెక్టు ప్రభావిత, పరిసర ప్రాంత మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేయడమే సింగరేణి సేవా సమితి ప్రధాన లక్ష్యమన్నారు. అందులో భాగంగానే వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. మహిళలు శిక్షణ తరగతులకు క్రమం తప్పకుండా హాజరై, నైపుణ్యాలను పూర్తిస్థాయిలో నేర్చుకొని స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని సూచించారు. శిక్షణ పూర్తయిన అనంతరం నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు హైదరాబాద్‌లోని ఖాదీ గ్రామోద్యోగ్ మహా విద్యాలయం ద్వారా ధ్రువపత్రాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. శిక్షణ పొందిన మహిళలు సొంతంగా యూనిట్లు ఏర్పాటు చేసుకోవడంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్‌లో స్టాళ్లు ఏర్పాటు చేసి విక్రయించేందుకు కూడా సింగరేణి సంస్థ సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్) బి. శివ కేశవ రావు, డీవైపీఎం కే. శివ కుమార్, వెల్ఫేర్ పీఏ కే. వరప్రసాద రావు, సేవా కో-ఆర్డినేటర్ ఇజాజ్ షరీఫ్, సేవా సెక్రటరీ మాధవీ స్వర్ణలత, సేవా కో-ఆర్డినేటర్లు రమాదేవి, మీనాక్షి, అరుణ, పద్మావతి, దీప, శిక్షకులు, సేవా సభ్యులు, శిక్షణ అభ్యర్థులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


