మూగజీవాల ప్రాణాలకు విలువ లేదా?
ఆవులను పట్టుకుంటే విడిపించే నాయకులు..
లేత దూడలు చనిపోతుంటే స్పందించరా?
రెండు రోజుల క్రితం కుక్కల దాడిలో దూడ మృతి..
ఆదివారం రాత్రి మరో దూడపై దాడికి యత్నం
తాత్కాలిక చర్యలతో సరిపెడుతున్న అధికారులు..
శాశ్వత పరిష్కారం కోసం ప్రజల ఎదురుచూపులు
కొత్తగూడెం బ్యూరో : పట్టణ రహదారులపై పశువుల సంచారం రోజురోజుకూ పెరుగుతున్నా సంబంధిత అధికారుల్లో మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్న ఆవులను అధికారులు పట్టుకోవడం, కొద్దిసేపటికే తిరిగి వదిలేయడం పరిపాటిగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తాత్కాలిక చర్యలతో సమస్యకు పరిష్కారం లభించకపోగా వాహనదారులు, పాదచారులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు రెండు రోజుల క్రితం కుక్కల దాడిలో అప్పుడే జన్మించిన లేత దూడ మృతి చెందిన ఘటన మూగజీవాల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ విషాద ఘటన మరువకముందే శనివారం రాత్రి మరో లేత దూడపై వీధి కుక్కలు దాడికి ప్రయత్నించాయి. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించి కుక్కలను తరిమికొట్టడంతో దూడ ప్రాణాలతో బయటపడింది. లేకపోతే మరో మూగజీవం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువుల యజమానులు తమ ఆవులను రోడ్లపై వదిలేయడం, వాటి సంరక్షణపై తగిన శ్రద్ధ చూపకపోవడం కూడా ఇలాంటి ఘటనలకు కారణమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పశువులను సొంతంగా చూసుకోవాల్సిన బాధ్యత యజమానులపై ఉన్నప్పటికీ, కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో మూగజీవాలు ప్రమాదాల బారిన పడుతున్నాయి. ఇక్కడ మరో అంశం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. రోడ్లపై తిరుగుతున్న ఆవులను అధికారులు పట్టుకున్నప్పుడు వాటిని విడిపించేందుకు రాజకీయ నాయకులు వెంటనే రంగంలోకి దిగుతున్నారని, కానీ కుక్కల దాడిలో లేత దూడలు ప్రాణాలు కోల్పోతున్నప్పుడు మాత్రం అదే స్థాయిలో స్పందన కనిపించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆవులను పట్టుకున్నప్పుడు విడిపించడం ఎంత ముఖ్యమో.. వాటి ప్రాణాలను కాపాడటం కూడా అంతే ముఖ్యం కాదా? మూగజీవాల పట్ల ప్రేమ చూపడం అంటే వాటిని విడిపించడం మాత్రమేనా? వాటికి రక్షణ కల్పించడం, యజమానులు బాధ్యతగా వ్యవహరించేలా చూడటం కూడా బాధ్యత కాదా? అని ప్రజలు నిలదీస్తున్నారు.
అధికారులు ఇప్పటికైనా తాత్కాలిక చర్యలకు స్వస్తి పలికి రోడ్లపై పశువుల సంచారాన్ని అరికట్టేందుకు శాశ్వత చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. పశువుల యజమానులకు బాధ్యతలు గుర్తుచేసి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని, వీధి కుక్కల బెడదను నియంత్రించేందుకు కూడా తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మూగజీవాల ప్రాణాలకు విలువ లేదా? రోడ్లపై ఆవుల సమస్యకు, వాటి భద్రతకు బాధ్యత వహించేది ఎవరు? అధికారులా.. ప్రజాప్రతినిధులా.. లేక పశువుల యజమానులా? ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మూగజీవాల ప్రాణాలను కాపాడటంతో పాటు పట్టణంలో పశువుల సంచార సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


