డేంజర్ జోన్ నిర్వాసితులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు...
846 ఇళ్ల గుర్తింపుపై నిర్వాసితుల ఆందోళన... అర్హులందరికీ పునరావాసం కల్పించాలి కటాఫ్ తేదీ పొడిగించాలని విజ్ఞప్తి
మల్హర్, : ... మండల కేంద్రమైన తాడిచెర్ల ఓసీపీకి 500 మీటర్ల పరిధిలోని గృహాల సేకరణపై సోమవారం తాడిచెర్ల పాత బస్టాండ్ ఆవరణలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభలో భూ నిర్వాసితులు తమ అభ్యంతరాలు, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్, జెన్కో సీఈవో ప్రకాష్, తహశీల్దార్ రవికుమార్ పాల్గొన్నారు.2022 డిసెంబర్‌లో విడుదల చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌లో 2,265 ఇళ్ల వివరాలను ప్రచురించగా, వాటిలో 1,203 ఇళ్లను అనుమతులు ఉన్నవిగా, 1,062 ఇళ్లను అనుమతులు లేనివిగా గుర్తించారు. అనంతరం నిర్వహించిన సర్వేలో 1,203 అనుమతులున్న ఇళ్లలో కేవలం 846 ఇళ్లనే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి అర్హమైనవిగా గుర్తిస్తూ జాబితా ప్రకటించడంపై నిర్వాసితులు అభ్యంతరం వ్యక్తం చేశారు.2008లో ఏపీ జెన్కో ఆధ్వర్యంలో ఇళ్లకు సీరియల్ నంబర్లు కేటాయించి గుర్తించినప్పటి నుంచి ఇప్పటివరకు ఇళ్ల సంఖ్యలో వచ్చిన మార్పులకు ప్రాతిపదిక ఏమిటని ఎన్‌హెచ్‌ఆర్‌సీ (నేషనల్ హ్యూమన్ రైట్స్) తరఫున భూ నిర్వాసితుడు బండి సుధాకర్ అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్‌ను ప్రశ్నించారు. 1,203 ఇళ్లలో 846 ఇళ్లనే అర్హులుగా ఎలా గుర్తించారని వివరణ కోరారు.భూ నిర్వాసితుడు ఇందరపు మహేందర్ మాట్లాడుతూ.. విత్ పర్మిషన్, వితౌట్ పర్మిషన్ అనే తేడా లేకుండా స్థానిక నిర్వాసితులందరినీ గుర్తించి న్యాయం చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి పన్ను నమోదు కోసం గతంలో రూ.300గా ఉన్న మొత్తాన్ని ప్రస్తుతం రూ.20 వేలు డిమాండ్ చేయడంతో పేదలు ఆ మొత్తం చెల్లించలేక ఇళ్లను గ్రామపంచాయతీలో నమోదు చేసుకోలేకపోయారని తెలిపారు. పన్ను నమోదు కాలేదనే కారణంతో స్థానికులను ప్యాకేజీకి దూరం చేయకుండా ప్రతి నిర్వాసితుడిని గుర్తించి పునరావాసం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.భూ నిర్వాసితుల కమిటీ అధ్యక్షుడు దండు రమేష్, సర్పంచ్ బండి స్వామి మాట్లాడుతూ.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయంలో 18 సంవత్సరాలు నిండిన ఆడ, మగ పిల్లలకు కటాఫ్ తేదీని మానవీయ కోణంలో పరిశీలించాలని కోరారు. నాలుగేళ్లపాటు కటాఫ్ తేదీని పొడిగించి 2026 మార్చి వరకు పరిగణనలోకి తీసుకోవాలని, అప్పటివరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ప్యాకేజీ వర్తింపజేయాలని కలెక్టర్‌ను కోరారు. ఇళ్లు కోల్పోయిన అర్హులందరికీ వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌తో సరిపెట్టకుండా పునరావాస స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.అనుమతులు లేని 1,062 ఇళ్ల పరిస్థితిపై నిర్వాసితులు ప్రశ్నించగా స్పష్టమైన సమాధానం రాకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. జాబితాలో పేర్లు లేని వారు దరఖాస్తు చేసుకునేందుకు డేంజర్ జోన్ బస్టాండ్ వద్ద ఒక కౌంటర్, తహశీల్దార్ కార్యాలయంలో మరో కౌంటర్ ఏర్పాటు చేసి వారం రోజులపాటు దరఖాస్తులు స్వీకరిస్తామని తహశీల్దార్ రవికుమార్ తెలిపారు. దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారి పేర్లను జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో కొయ్యురు ఎస్ఐ మహేందర్ కుమార్ బారీ బందోబస్తు నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్ఆర్ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్, భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు దండు రమేష్, తాడిచెర్ల పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మోండయ్య, సర్పంచ్ బండి స్వామి నిర్వాసితులు బండి రాజయ్య, మాజీ సర్పంచ్ దన్నపనేని అశోక్ రావు, కోట రవి రెవెన్యూ అధికారులు, భూ నిర్వాసితులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


