కనుమరుగవుతున్న ఎడ్ల నాగలి దున్నుడు.. నేటికీ సంప్రదాయ వ్యవసాయానికి పట్టం కడుతున్న రైతు!
సాలూర : ఆధునిక వ్యవసాయంలో ట్రాక్టర్ల వినియోగం పెరిగి, ఎడ్లతో నాగలి దున్నే పద్ధతి క్రమంగా కనుమరుగవుతున్న ప్రస్తుత రోజుల్లోనూ ఓ రైతు సంప్రదాయ వ్యవసాయ పద్ధతిని కొనసాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రానికి చెందిన మైదాపు సాయినాథ్ తన ఎడ్లతోనే పొలాలను దున్నుతూ జొన్న విత్తనాలు విత్తుతున్నాడు. ప్రస్తుతం రైతులు ఎక్కువగా ట్రాక్టర్ల ద్వారా దున్నుడు, అలుకుడు పనులు చేయిస్తుండగా, సాయినాథ్ మాత్రం తన ఎడ్లను వ్యవసాయానికి ఉపయోగిస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ట్రాక్టర్ ద్వారా ఎకరానికి సుమారు రూ.1,000 ఖర్చవుతుండగా, తాను ఎడ్లతో దున్నేందుకు ఎకరానికి రూ.1,200 తీసుకుంటున్నట్లు తెలిపాడు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు శ్రమిస్తూ రోజుకు సుమారు రెండు ఎకరాల వరకు దున్నగలుగుతున్నట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం సాలూర శివారులో సుమారు రెండున్నర ఎకరాల్లో జొన్న పంట సాగు కోసం తన ఎడ్లతోనే నాగలి ద్వారా దున్ని, విత్తనాలు విత్తినట్లు సాయినాథ్ వివరించాడు. ఎకరానికి ఐదు కిలోల జొన్న విత్తనాలు ఉపయోగిస్తున్నట్లు తెలిపాడు. తనకు సొంతంగా రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, అందులో దున్నుడు, విత్తనాలు విత్తడం, రాశి చేయడం వంటి పనులన్నీ తన ఎడ్ల సహాయంతోనే చేసుకుంటున్నట్లు చెప్పాడు. వ్యవసాయానికి అవసరమైన ఎడ్లబండి, నాగలి తదితర పరికరాలను కూడా తన వద్ద ఉంచుకున్నాడు. ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ పాతకాలపు వ్యవసాయ పద్ధతులను వదలకుండా కొనసాగిస్తున్న సాయినాథ్‌ను చూసి పలువురు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఒకప్పుడు గ్రామీణ వ్యవసాయానికి వెన్నెముకగా నిలిచిన ఎడ్ల నాగలి దున్నుడు నేటికీ అక్కడక్కడ కనిపించడం విశేషం.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


