ఊట్కూర్‌లో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
.. శివాలయాల్లో భక్తుల సందడి.. ...కార్తీక దీపాలతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ
నారాయణపేట : ఉట్కూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో మంగళవారం కార్తీక పౌర్ణమి వేడుకలను భక్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణాలు శివనామస్మరణతో మార్మోగాయి.తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో వెలసిన శ్రీ శంకర్ లింగేశ్వర స్వామి ఆలయంతో పాటు ఊట్కూర్‌లోని ఈశ్వర్ మందిరం, వీరభద్రేశ్వర స్వామి దేవాలయం, అయోధ్య నగర్ శివాలయం, భరత్ నగర్ శివాలయం, శ్రీ భవానిమందిరం, బిజ్వార్ లో అంబాత్రాయ క్షేత్రం నిడుగుర్తి గుట్టపై వెలసిన శివాలయం, పులిమామిడిలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.కార్తీక మాసం చివరి పర్వదినమైన పౌర్ణమి సందర్భంగా మహిళలు ఆలయాల్లో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. దీపాల వెలుగులతో ఆలయ ప్రాంగణాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. భక్తులు శివుడిని దర్శించుకొని కుటుంబసభ్యుల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు.అలాగే పవిత్ర కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని పలువురు భక్తులు వల్లభాపురం వద్ద కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విధంగా మండలవ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తి పారవశ్యంతో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా ముగిశాయి.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


