చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ముద్రించిన నోట్లను అసలు కరెన్సీగా నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు.

చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ముద్రించిన నోట్లను అసలు కరెన్సీగా నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు.

ఆరుగురిపై కేసు నమోదు.. నలుగురు నిందితులు అరెస్ట్.

99 కట్టల చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లు, 100 నకిలీ బంగారు నాణేలు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం.

నిందితులపై ఆదిలాబాద్, హైదరాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలలో వివిధ రకాల నేరాల కేసుల నమోదు.

ఇప్పటికే మరో కేసులో ఇద్దరు ప్రధాన నిందితులు అరెస్టు.

*పత్రికా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 

ఆదిలాబాద్ బ్యూరో  : అసలైన కరెన్సీ నోట్లకు బదులుగా చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో, ఇతర పేర్లతో కొనుగోలు చేసిన నోట్లను నకిలీ నోట్లు కావాలనుకునే వారికి అందిస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి మొత్తం  రూ 40 లక్షల పై చిలుకు విలువ గల 99 కట్టల చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లు,100 నకిలీ బంగారు నాణేలను, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు ప్రధాన నిందితులు ఇప్పటికే వేరే కేసులో అరెస్టయి ఉన్నారు.
కేసు వివరాలు:
మంచిర్యాల జిల్లాకు చెందిన పత్తి రాములు అనే వ్యక్తికి 2023 నవంబర్ నెలలో అత్రం పరశురామ్ పరిచయమయ్యాడు. ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న పరశురామ్ పూజలు, మంత్రతంత్రాల ద్వారా డబ్బులను రెట్టింపు చేయవచ్చని బాధితుడిని నమ్మించాడు. రూ.6.50 లక్షలు ఇస్తే పూజలు చేసి రూ.13 లక్షలు తిరిగి ఇస్తానని ఆశ చూపించాడు.
అతని మాటలు నమ్మిన బాధితుడు 10.11.2023న షాంపూర్ గ్రామ శివారులో పరశురామ్‌కు రూ.6.50 లక్షలు అందజేశాడు. అనంతరం పరశురామ్ ఒక పొలం వద్దకు తీసుకెళ్లి సుమారు 15 నిమిషాల పాటు పూజలు చేసి, డబ్బులు రెట్టింపు అయ్యాయని చెబుతూ ఒక బ్యాగును అందజేసి పది రోజుల తర్వాత తెరవాలని సూచించాడు.
పది రోజుల తర్వాత బ్యాగును తెరిచి చూడగా అందులో అసలైన కరెన్సీకి బదులుగా చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ముద్రించిన నోట్లు, తెల్ల కాగితాలు కనిపించాయి. దీంతో బాధితుడు మోసపోయినట్లు గుర్తించి పరశురామ్‌ను సంప్రదించగా, ఇంట్లో దోషం ఉందని, మరోసారి పూజలు చేయాలని నమ్మించాడు. అనంతరం ఇంటి శుద్ధి పూజల పేరుతో రూ.50 వేలు, ఇప్పటివరకు ఇచ్చిన డబ్బులు రెట్టింపు అవుతాయని చెప్పి మరో రూ.లక్ష తీసుకున్నాడు. ఇలా మొత్తం రూ.8 లక్షలు తీసుకొని బాధితుడిని మోసం చేశాడు.
ఈ ఘటనపై బాధితుడు 22.11.2026న ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు క్రైమ్ నంబర్ 433/2026, సెక్షన్ 420 ఐపీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నిందితుల మోసపూరిత విధానం:
ప్రధాన నిందితులైన అత్రం పరశురామ్, మండలి బక్కన్నలు పూజలు, మంత్రతంత్రాల పేరుతో ప్రజలను నమ్మించి డబ్బులు వసూలు చేస్తుండగా, వారికి సహకరిస్తున్న మరో నలుగురు నిందితులు చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో, ఇతర పేర్లతో ఉన్న నోట్లను  కొనుగోలు చేసి మార్కెట్లో, సరఫరా చేస్తున్నట్లు  పోలీసుల విచారణలో వెల్లడైంది.
అసలైన కరెన్సీ నోట్ల కట్టలుగా నమ్మించేందుకు పైన, కింద అసలైన కరెన్సీ నోట్లను ఉంచి, మధ్యలో చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ముద్రించిన నోట్ల కట్టలను అమర్చి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. ఈ విధంగా ప్రధాన నిందితుడు పరశురామ్‌కు సహకరిస్తూ మిగిలిన నలుగురు నిందితులు మోసాలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైంది.
ఈరోజు అరెస్టయిన నిందితుల వివరాలు:
1. ఎంబడి మల్లేష్ (36), s/o నర్సయ్య, చెన్నూరు గ్రామం, దస్తూరాబాద్ మండలం, నిర్మల్ జిల్లా.

2. చీటి తరుణ్ (24), s/o   లూకయ్య, మదర్ థెరిస్సా కాలనీ, జన్నారం మండలం, మంచిర్యాల జిల్లా.

3. జమల్‌పూర్ సాయి కృష్ణ @ సాయి (25), s/o  సత్తయ్య, శ్రీలంక కాలనీ, పొన్కల్ గ్రామం, జన్నారం మండలం, మంచిర్యాల జిల్లా.

4. పేంద్రం సురేష్ (39), s/o  కిషన్, వరద బాధితుల కాలనీ, జన్నారం గ్రామం, మంచిర్యాల జిల్లా.
పైన తెలియజేసిన నిధులపై ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ హైదరాబాద్ జిల్లాలలో పలు కేసులో నమోదు అయినట్లు తెలిపారు. జిల్లాలో పలు కేసులు నమోదు అయినట్లు తెలిపారు. నిందితులపై వివిధ జిల్లాలలో ఒక్కొక్కరిపై మూడు కేసులు ఉన్నట్లు తెలిపారు. వీరి బాధితులు 40 సంఖ్యలో ఉండవచ్చని నిర్భయంగా బాధితులు జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించి ఫిర్యాదు చేస్తే వారికి తగిన న్యాయం చేసే విధంగా కృషి చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ సూచించారు.
ఇప్పటికే మరో కేసులో అరెస్టయిన ప్రధాన నిందితులు:
1. అత్రం పరశురామ్ (40), s/o  పైకు, గిన్నెర గ్రామం, ఇంద్రవెల్లి మండలం.

2. మండలి బక్కన్న (47), s/o  ఇంద్రయ్య, శాంతినగర్ కాలనీ, ఇంద్రవెల్లి గ్రామం, ఇంద్రవెల్లి మండలం.
పై ఇద్దరు ప్రధాన నిందితులు ఇప్పటికే సోమవారం ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మరో కేసులో అరెస్టయి ఉన్నారు.
స్వాధీనం చేసుకున్న వస్తువులు:
- రూ.500 ముఖ విలువతో చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ముద్రించిన నోట్ల 34 కట్టలు.
- రూ.100 ముఖ విలువతో ముద్రించిన నోట్ల 55 కట్టలు.
- రూ.2,000 ముఖ విలువతో ముద్రించిన నోట్ల 10 కట్టలు.
- మొత్తం 99 కట్టల చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లు.
- మూడు సెల్‌ఫోన్లు.
- 100 నకిలీ బంగారు నాణేలు. 
స్వాధీనం చేసుకున్న చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ఉన్న నకిలీ నోట్ల విలువ దాదాపు 40 లక్షల పైచిలుకు ఉండొచ్చని అంచనా వేశారు.
ప్రజలకు పోలీసుల సూచన:
మంత్రతంత్రాలు, పూజల పేరుతో డబ్బులు రెట్టింపు చేస్తామని చెప్పే వ్యక్తులను నమ్మవద్దు. తక్కువ సమయంలో అధిక మొత్తంలో డబ్బులు వస్తాయనే ఆశతో ఇలాంటి మోసగాళ్లకు డబ్బులు ఇచ్చి నష్టపోవద్దు. ముఖ్యంగా కరెన్సీ నోట్ల కట్టలను స్వీకరించే సమయంలో వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలి. అసలైన నోట్లతో పాటు ఇతర పేర్లతో ముద్రించిన నోట్లను కలిపి కట్టలుగా తయారుచేసి మోసాలకు పాల్పడే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి మోసాల సమాచారం తెలిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని జిల్లా పోలీసులు సూచిస్తున్నారు.

Views: 14

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న
మక్తల్ :  నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో స్థానిక పడమటి ఆంజనేయస్వామి దేవాలయ ఆవరణలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ( వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు...
గ్రామపంచాయతీ ఉద్యోగుల సమస్యలపై ఐ ఎన్ టి యు సి తో కీలక చర్చలు
విజన్ ఆంధ్ర స్పాట్ న్యూస్‌కు స్పందన.. ఆత్మకూర్ వాగులో పోలీసుల మెరుపు దాడులు!
సర్వే చేసింది ఎవరు.. జాబితా మార్చింది ఎవరు. ?
మైసమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవానికి మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం
బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గా రూపిరెడ్డి ఆదిరెడ్డి.....
మాల మహానాడు సిద్దిపేట జిల్లా వర్కింగ్ అధ్యక్షుడుగా చింతల విజయ్ నియామకం.