ఆదిలాబాద్ అడవి అందాలు.. సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటేలా వీడియో గీతం
‘తల్లి నా ఆదిలాబాద్.. అడవి తల్లి జిల్లా’ పాటను ఆవిష్కరించిన కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి అందాలు, అటవీ సంపద, ఆధ్యాత్మిక క్షేత్రాలు, సంస్కృతి సంప్రదాయాలు, స్థానిక కళాకారుల ప్రతిభను ప్రతిబింబించేలా రూపొందించిన ‘తల్లి నా ఆదిలాబాద్.. అడవి తల్లి జిల్లా’ వీడియో గీతాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆవిష్కరించి, తిలకించారు. జిల్లా కళాకారులు, తెలంగాణ సంస్కృతిక సారథి కళాకారులు సంయుక్తంగా రూపొందించిన ఈ వీడియో గీతం ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేకతను, ప్రకృతి రమణీయతను, అటవీ వైభవాన్ని ప్రజలకు పరిచయం చేసేలా ఉందని కలెక్టర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి సౌందర్యానికి, అపారమైన అటవీ సంపదకు, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలకు, విభిన్న సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. జిల్లాలోని సహజ వనరులు, పర్యాటక ప్రదేశాలు, స్థానిక కళలు, సంస్కృతి వైభవాన్ని వీడియో గీతం రూపంలో ప్రజలకు పరిచయం చేయడం అభినందనీయమన్నారు. కళలు, సాహిత్యం, సంగీతం ద్వారా ఒక ప్రాంతం యొక్క చరిత్ర, సంస్కృతి, ప్రత్యేకతలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. స్థానిక కళాకారులు తమలోని సృజనాత్మకతను, ప్రతిభను వెలికితీస్తూ ఆదిలాబాద్ జిల్లా ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జిల్లా ప్రకృతి అందాలు, అడవుల ప్రాధాన్యత, సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేసే ఇటువంటి సృజనాత్మక ప్రయత్నాలకు జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. వీడియో గీతం రూపకల్పనలో భాగస్వాములైన కళాకారులందరినీ కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం జిల్లా కళాకారులు కలెక్టర్ రాజర్షి షాను ఘనంగా సత్కరించగా, కలెక్టర్ సైతం కళాకారులను అభినందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాజేశ్వర్, ఆర్.ఎస్. చిత్రు, డిఆర్ఓ స్రవంతి, డిపిఆర్ఓ విష్ణువర్ధన్, కళాకారులు దత్తు, రవి, వెంకట్రావు, గోవింద్, శంకర్, రాజలింగు, మురళి, ఆశిష్, నర్సమ్మ, మోహన్ నాయక్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

