అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు
దేవ దీపావళి భారతీయ సనాతన ధర్మ సంప్రదాయంలో కార్తికమాసానికి విశిష్ట స్థానం ఉంది. అందులోనూ నేటి కార్తిక పౌర్ణమి ‘త్రిపురారి పౌర్ణమి’, ‘దేవదీపావళి’ అనే పేర్లతో ప్రసిద్ధి చెందింది. శివపురాణం ప్రకారం, తారకాసురుడి కుమారులైన తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి బ్రహ్మను మెప్పించి మూడు పురాలను వరంగా పొందారు. అసురుల మహాశిల్పిగా ప్రసిద్ధుడైన మయుడు బంగారం, వెండి, ఇనుములతో ఆ మూడు పురాలను నిర్మించాడు. కార్తిక పౌర్ణమినాడు దేవతల ప్రార్థనపై పరమశివుడు దివ్యరథాన్ని అధిరోహించి, ఒకే బాణంతో ఆ మూడు పురాలను ధ్వంసం చేశాడు. ఈ మహత్తర విజయంతో శివుడు ‘త్రిపురాంతకుడు’, ‘త్రిపురారి’ అనే నామాలతో ప్రసిద్ధిచెందాడు. మనిషి వివేకాన్ని నశింపచేసే కామం, క్రోధం, లోభం వంటి మనోవికారాలను త్రిపురాలకు ప్రతీకలుగా భావిస్తే, త్రిపురాసుర సంహారం మనలోని దుర్గుణాలపై వివేకం సాధించే విజయానికి సంకేతంగా నిలుస్తుంది. బాహ్యంగా మూడు పురాలను భస్మం చేసిన శివయ్యను తలచుకుంటూ ప్రకృతిని దీపకాంతులతో అలంకరించే ఈ పర్వదినం- అంతరంగంలో అజ్ఞానం, అహంకారం, దురాలోచనలు తొలగినప్పుడే ఆధ్యాత్మిక పరివర్తన సాధ్యమవుతుందనే సందేశాన్ని ఇస్తుంది. నేడు దేవతలు కాశీ క్షేత్రంలో గంగాస్నానం చేసి దీపాలు వెలిగిస్తారనే విశ్వాసంతో ఈ పండుగను దేవదీపావళిగా భావిస్తారు. దీపాల వెలుగులో గంగాతీరం ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకోవడం భారతీయ సంస్కృతిలో- ప్రకృతి, భక్తి, సామూహిక ఆరాధనల సమన్వయానికి ప్రతీకగా నిలుస్తుంది. కార్తిక పౌర్ణమినాడు దీపదానం, అన్నదానం, వస్త్రదానం వంటి సత్కార్యాలు చేయడం ద్వారా మానసిక పవిత్రత, దానశీలత, పరుల పట్ల కరుణ వంటి విలువలను పెంపొందించుకోవచ్చు. ఆచారం ఆధ్యాత్మికతకు మార్గమైతే, మానవీయ విలువలు దాని సార్థకతకు ప్రమాణాలు. ఈ పర్వదినంలో ముఖ్యమైన ‘హరిహర అభేదం’ ఆధ్యాత్మిక సమన్వయాన్ని చాటుతుంది. శివారాధన, విష్ణు సహస్రనామ పారాయణం, సత్యనారాయణవ్రతం వంటి దైవారాధన మార్గాలు వేర్వేరైనా, భగవంతుడి కృపను అనుగ్రహించేది నిష్కల్మషమైన భక్తి మాత్రమే. కార్తికమాసంలో ఉసిరి చెట్టును పూజించడం, దాని నీడలో భోజనం చేయడం వంటి ఆచారాలు ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తాయి. ప్రకృతిని పూజించడమంటే దాని విలువను గుర్తించడం, పరిరక్షించుకోవడం. ‘దీపో జ్యోతిః పరం బ్రహ్మ దీప జ్యోతిర్జనార్దనః దీపో హరతు మే పాపం సంధ్యాదీప నమోస్తు తే’ అన్న ప్రార్థనలో దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, జనార్దనుడి తేజస్సుగా భావిస్తాం. ఇక్కడ దీపం చీకటిని తొలగించే జ్ఞానానికి, మనిషిని సన్మార్గంలో నడిపించే వివేకానికి ప్రతీక. అహంకారం, అసూయ, ద్వేషం, అవివేకం వంటి చీకట్లను పారదోలే వివేకం, కరుణ, సహనం, ధర్మనిష్ఠలను పెంపొందించుకోవడమే నిజమైన జ్యోతి ప్రజ్వలన అన్నది కార్తికపౌర్ణమి అంతరార్థం. ఈరోజు వెలిగించే దీపాలు మనసును కాంతిమంతం చేసే జ్ఞానానికి ప్రతీకలు. నిత్యం శివకేశవులను స్మరిస్తూ, ప్రకృతిని గౌరవిస్తూ, మానవత్వాన్ని ఆచరణలో నిలుపుకొంటూ జీవించాలి. అప్పుడే దేవదీపావళిలోని పారమార్థిక సందేశాన్ని మనం అర్థం చేసుకున్నట్లు అవుతుంది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


