సర్వే చేసింది ఎవరు.. జాబితా మార్చింది ఎవరు. ?
2,265 ఇళ్ల నుంచి 847కు తగ్గిన అర్హుల సంఖ్య! ఐదు సర్వే బృందాల పరిశీలనపై నిర్వాసితుల అనుమానాలు మరణించినవారు బతికున్నట్లు.. పెళ్లికాని యువతులకు మ్యారీడ్గా నమోదు!
మల్హర్, : ఓసీపీ బ్లాక్-01 బొగ్గు గనికి 500 మీటర్ల డేంజర్ జోన్ పరిధిలో ఉన్న తాడిచెర్ల గ్రామంలోని ఇళ్ల సేకరణ, పరిహారం, ఆర్అండ్ఆర్ పునరావాస ప్యాకేజీ వ్యవహారం రోజురోజుకూ వివాదాస్పదంగా మారుతోంది. గత మూడు నెలల క్రితం నిర్వహించిన సోషల్ ఎకనామిక్ సర్వే, గతంలో చేపట్టిన డిజిటల్ సర్వేలు, గ్రామపంచాయతీ రికార్డులు ఒకవైపు ఉంటే.. తాజాగా విడుదలైన డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో అర్హుల సంఖ్య భారీగా తగ్గిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. 2022లో 2,265 ఇళ్లను ప్రిలిమినరీ నోటిఫికేషన్లో చేర్చిన అధికారులు, 2026 డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో కేవలం 847 గృహాలనే అర్హులుగా చూపడంపై నిర్వాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సర్వేలు ఎన్నో.. లెక్కలు మాత్రం తారుమారు!
2022లో డిజిటల్ సర్వే నిర్వహించి, సమ్మతి పత్రాలు సేకరించిన అధికారులు.. 2026లో మరోసారి ఐదు బృందాలతో సోషల్ ఎకనామిక్ సర్వే చేపట్టారు. దాదాపు నెల రోజులపాటు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించడంతోపాటు మరో రెండు నెలలపాటు డాక్యుమెంట్ల పరిశీలన చేసినట్లు చెబుతున్నారు. నిర్వాసితుల నుంచి పూర్తి వివరాలు, ఆధారాలు తీసుకున్న తర్వాత ప్రకటించిన జాబితాలో ఇంతటి వ్యత్యాసం ఎలా వచ్చిందనేది ప్రశ్నార్థకంగా మారింది.సర్వేలో మరణించిన వ్యక్తులను సైతం బతికున్నట్లుగా చూపించడం, వివాహం కాని యువతులను వివాహితులుగా 'మ్యారీడ్' అని నమోదు చేయడం వంటి తప్పులు చోటుచేసుకున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. సర్వే బృందాలతో కలిసి తిరిగి తమ ఇళ్ల వివరాలు నమోదు చేయించిన స్థానికుల పేర్లు సైతం అర్హుల జాబితాలో కనిపించకపోవడం మరింత విస్మయానికి గురిచేస్తోంది.
1,203 ఇళ్ల రికార్డులు.. తొలగింపులపై ప్రశ్నలు!
2022 ప్రిలిమినరీ నోటిఫికేషన్ అనంతరం 2023లో రెవెన్యూ బృందాలు నిర్వహించిన మరో సర్వేలో 1,203 ఇళ్లు గ్రామపంచాయతీ రికార్డుల్లో నమోదైనట్లు బాధితులు పేర్కొంటున్నారు. మరో 1,062 ఇళ్లను అనుమతులు లేని నిర్మాణాలుగా వర్గీకరించిన అధికారులు అనంతరం జరిగిన ప్రక్రియలో అనుమతులు లేని ఇండ్లు గా నమోదు చేసి తొలగించడంతోపాటు, రికార్డుల్లో ఉన్న ఇళ్లలోనూ సుమారు 350కి పైగా గృహాల వివరాలు తొలగించారని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. మరోవైపు సుమారు 1800 ల దరఖాస్తులను పరిశీలిస్తున్నామని గతంలో అధికారులు చెప్పినప్పటికీ, నెలల తరబడి సర్వేలు, డాక్యుమెంట్ల పరిశీలన తర్వాత కూడా అర్హుల జాబితాలో ఇన్ని లోపాలు ఎలా వచ్చాయంటూ బాధితులు నిలదీస్తున్నారు.
గ్రామసభలో ప్రశ్నలు.. అధికారుల మౌనం!
సోమవారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభలో నిర్వాసితులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. తమ ముందే సర్వే బృందాలు నమోదు చేసుకున్న ఇళ్ల వివరాలు జాబితాలో ఎందుకు కనిపించడం లేదని, కొత్తగా పేర్లు ఎలా చేరాయని అధికారులను ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నలకు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అధికారులు మౌనం వహించారని, సరైన సమాధానాలు చెప్పకుండానే గ్రామసభను ముగించారని నిర్వాసితులు విమర్శిస్తున్నారు.
జాబితా తయారు చేసింది సర్వే బృందాలా.. అదృశ్య శక్తులా?
ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించిన ఐదు సర్వే బృందాలకు తెలియకుండా జాబితాలో కొత్త పేర్లు ఎలా చేరాయి? తమ ముందే నమోదు చేసిన పేర్లు ఎందుకు గల్లంతయ్యాయి? సర్వే బృందాలు తయారు చేసిన వివరాల ఆధారంగానే జాబితా రూపొందించారా? లేక మధ్యలో మరెవరైనా జోక్యం చేసుకున్నారా? అనే అనుమానాలు నిర్వాసితుల్లో వ్యక్తమవుతున్నాయి.జెన్కో అధికారులు ఇచ్చిన జాబితా ఆధారంగానే జిల్లా, రెవెన్యూ అధికారులు ముందుకు వెళ్లారా? పరిహారం, పునరావాస ప్యాకేజీ బాధ్యతలను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగానే నిర్దాక్షిణ్యంగా ఇళ్ల సంఖ్యను తగ్గించారా? అనే సందేహాలను సైతం బాధితులు లేవనెత్తుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై ఇప్పటివరకు అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.
ఇళ్ల పరిహారానికి ముందే ఆర్అండ్ఆర్ జాబితానా?
సాధారణంగా ఇళ్ల సేకరణ, పరిహారం ప్రక్రియ అనంతరం ఆర్అండ్ఆర్ పునరావాస ప్యాకేజీ అర్హుల జాబితాను ప్రకటించే విధానానికి భిన్నంగా తాడిచెర్లలో ముందుగానే ఆర్అండ్ఆర్ జాబితాను ప్రదర్శించడంపై నిర్వాసితులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాపురం ఆదివాసీ గ్రామం సేకరణ సమయంలో ఇంటి పన్ను రసీదులు, స్థానికత, స్థానికేతరులనే తేడాలు లేకుండా అందరికీ ఇళ్ల పరిహారం ఇచ్చి, అనంతరం ఆర్అండ్ఆర్ జాబితాను తదుపరి గ్రామసభలో ప్రదర్శించారని గుర్తుచేస్తున్నారు.కానీ తాడిచెర్లలో మాత్రం ఇళ్ల సేకరణ, పరిహారం ప్రక్రియ పూర్తికాకముందే పునరావాస జాబితా ప్రకటించడం ద్వారా నిర్వాసితుల మధ్య స్థానికులు, స్థానికేతరులనే విభేదాలు సృష్టించి అసలు సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పారదర్శక విచారణే పరిష్కారం!
ఐదు సర్వే బృందాలు క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాలు, 2022 డిజిటల్ సర్వే, 2023 రెవెన్యూ సర్వే, గ్రామపంచాయతీ రికార్డులు, 2026 సోషల్ ఎకనామిక్ సర్వే వివరాలను బహిరంగంగా పోల్చి పరిశీలించాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. అసలు అర్హుల జాబితాను ఎవరు రూపొందించారు? ఏ ప్రాతిపదికన 2,265 ఇళ్ల సంఖ్య 847కు తగ్గింది? సర్వేలో నమోదు చేసిన పేర్లు ఎందుకు గల్లంతయ్యాయి? కొత్త పేర్లు ఎలా చేరాయి? అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాలని కోరుతున్నారు.అర్హులకు అన్యాయం జరగకుండా నిష్పక్షపాత విచారణ చేపట్టి, తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, తొలగించిన ఇళ్ల వివరాలను తిరిగి పరిశీలించి అర్హులైన ప్రతి నిర్వాసితుడికి న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


