సీఎం సహాయ నిధి కింద 17 మందికి రూ.8 లక్షల ఆర్థిక సాయం
సాలూర మండల కేంద్రంలో మండలానికి చెందిన 17 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) కింద మంజూరైన రూ.8 లక్షల విలువైన చెక్కులు, మంజూరు పత్రాలను మంగళవారం ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేశారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, హున్సా సొసైటీ చైర్మన్ మందర్న రవి మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు సీఎం సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అర్హులైన వారికి ప్రభుత్వ సహకారం అందేలా ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని పేర్కొన్నారు.అదేవిధంగా మండల అభివృద్ధికి ప్రభుత్వ ముఖ్య సలహాదారులు మంజూరు చేసిన నిధుల వివరాలను వెల్లడించారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.1.70 కోట్లు, పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణానికి రూ.50 లక్షలు, తగ్గెల్లి, కొప్పర్తి గ్రామాల్లో గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.52 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. అలాగే వ్యవసాయ అవసరాల కోసం గ్రావెల్ రోడ్ల నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.2 కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లు వివరించారు.మండల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి నూతన భవన నిర్మాణం, మెరుగైన వైద్య సదుపాయాల కల్పనకు కూడా చర్యలు తీసుకుంటామని ఇటీవల ప్రభుత్వ ముఖ్య సలహాదారులు హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మండల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ నిధులు మంజూరు చేస్తున్న పి.సుదర్శన్ రెడ్డికి మండల ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సాలూర, సాలంపాడ్ సొసైటీ చైర్మన్లు అల్లె రమేష్, వీరంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ బాలకృష్ణారెడ్డి, జాడి మాజీ సర్పంచ్ నానిబాబు, సొసైటీ డైరెక్టర్ గౌస్, నాయకులు ఖాజాపూర్ అనిల్, కౌటిల్య, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


