రైతు డిస్కంతో ఉచిత విద్యుత్‌కు ముప్పు!
జీఓ 17తో రైతులకు నష్టమే ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నా పట్టింపేదీ? బీఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షుడు రహీమొద్దీన్
దౌల్తాబాద్,సిద్దిపేట: రైతు డిస్కం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 17 పై బీఆర్‌ఎస్ మాజీ మండల అధ్యక్షుడు సయ్యద్ రహీమొద్దీన్ మండిపడ్డారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించాల్సిన ప్రభుత్వం. కొత్త డిస్కం ఏర్పాటుతో ఆ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఇప్పటికే గ్రామాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నా పట్టించుకునే నాథుడే లేరని, విద్యుత్ సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త డిస్కం ఏర్పాటు చేస్తే రైతుల కష్టాలు మరింత పెరిగే ప్రమాదం ఉందన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించడం ప్రభుత్వ బాధ్యత అని రహీమొద్దీన్ పేర్కొన్నారు. రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాల్సింది పోయి, కొత్త విధానాలతో మరిన్ని సమస్యలు సృష్టించడం సరికాదన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయినప్పుడు సకాలంలో మరమ్మతులు చేపట్టి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. రైతులకు ఉచిత విద్యుత్ పథకం యథావిధిగా కొనసాగుతుందనే భరోసాను ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాలు రైతులకు మేలు చేసేలా ఉండాలే తప్ప, వారి మీద అదనపు భారం మోపేలా ఉండకూడదని రహీమొద్దీన్ అన్నారు. జీఓ 17 అమలుతో ఉచిత విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా స్పష్టత ఇవ్వాలని కోరారు. రైతుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని, విద్యుత్ సరఫరా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


