ఎల్‌నినో ప్రభావం.. హైదరాబాద్‌లో తాగునీటి సరఫరాపై ప్రభుత్వ ప్రత్యేక దృష్టి
నీటి పొదుపుపై విస్తృత ప్రచారం చేపట్టాలి.. ఎస్టీపీ శుద్ధి నీటిని ఇతర అవసరాలకు వినియోగించాలి: సీఎస్ సంజయ్ జాజు
హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావం కారణంగా రానున్న రోజుల్లో తాగునీటి సరఫరాకు ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో నీటి సరఫరా సన్నద్ధతపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.కే. జాజు, ఐఏఎస్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమీక్షలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిశోర్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) ఎండీ అశోక్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ, ఎంఎంసీ, సెరిలింగంపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లు, నీటిపారుదల శాఖ, మిషన్ భగీరథ విభాగాల అధికారులు పాల్గొన్నారు. జీహెచ్‌ఎంసీ, సీఏంసీ, ఎంఎంసీ పరిధిలోని కోర్ ఏరియాలో తాగునీటి సరఫరా పరిస్థితులు, భవిష్యత్ అవసరాలు, ముందస్తు జాగ్రత్తలపై చర్చించారు.
ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అవసరమైన సందర్భాల్లో తక్షణమే స్పందించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, అత్యవసర ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు.నీటి పొదుపుపై విస్తృత ప్రచారంప్రజల్లో నీటి పొదుపుపై అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సీఎస్ సూచించారు. తాగునీటిని అత్యంత జాగ్రత్తగా, అవసరమైన మేరకే వినియోగించేలా ప్రజలను చైతన్యపరచాలని పేర్కొన్నారు. నీటి వృథాను అరికట్టడంతో పాటు అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.గృహేతర అవసరాలకు ఎస్టీపీ నీరు మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో (STP) శుద్ధి చేసిన నీటిని గృహేతర అవసరాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ముఖ్యంగా మొక్కల పెంపకం, తోటల నిర్వహణ, ఇతర అనువైన అవసరాలకు శుద్ధి చేసిన నీటిని ఉపయోగించడం ద్వారా తాగునీటిపై ఒత్తిడిని తగ్గించవచ్చని సూచించారు.అవసరమైన నిధులు సమకూర్చాలి కోర్ అర్బన్ రీజియన్‌లో ప్రజలకు సరిపడా తాగునీరు నిరంతరాయంగా అందించేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యాచరణ ప్రణాళిక అమలుకు అవసరమైన నిధులను ముందుగానే గుర్తించి, తగినన్ని నిధులు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తాగునీటి సరఫరా నిర్వహణ, నీటి పొదుపు, ప్రత్యామ్నాయ వనరుల వినియోగం, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సన్నద్ధత వంటి అంశాలపై సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


