కడియంపై కారుకూతలు కూస్తే ఖబడ్దార్! -- జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు స్టేషన్ ఘన్‌పూర్ :
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనుచిత విమర్శలు చేస్తే సహించేది లేదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు హెచ్చరించారు. మంగళవారం మున్సిపల్ కేంద్రంలోని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై చౌకబారు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. మాజీ ఎమ్మెల్యే రాజయ్య రాజకీయ హుందాతనంతో మాట్లాడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంపై అవాకులు చవాకులు మాట్లాడటం తగదన్నారు. రైతులకు రెండు పంటలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పనిచేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, సుమారు రూ.1,600 కోట్లతో అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. జనగామ జిల్లా ఏర్పాటు ప్రజల పోరాట ఫలితమని, జిల్లా ఏర్పాటులో కడియం శ్రీహరి పాత్ర కీలకమని అన్నారు. ఈ విషయంలో కడియం పాత్ర లేదని పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించడం సిగ్గుచేటని విమర్శించారు. జనగామ జిల్లా విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టు రూపకల్పనలో కడియం శ్రీహరి కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మండల అధ్యక్షులు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, నాయకులు అంబటి కిషన్ రాజు, లింగాల జగదీష్ చందర్, బెలిదె వెంకన్న, బూర్ల శంకర్, కొంతం శ్రీనివాస్, పోగుల సారంగపాణి, దిలీప్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


