ఏసీబీ వలలో తహసీల్దార్‌తో పాటు మండల సర్వేయర్
- రూ.20 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా బుక్
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఇద్దరు ప్రభుత్వ అధికారులను ఏసీబి అధికారులు అరెస్ట్ చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ మండల సర్వేయర్ బటుక శ్రీనివాసులు, తహసీల్దార్ బి. సుదర్శన్ రెడ్డి లను అదుపులోకి తీసుకున్నారు. వీరు హెచ్‌ఎండీఏ మార్గదర్శకాల ప్రకారం లేఅవుట్ సర్వే నిర్వహణ కోసం లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వున్నాయి. జాయింట్ ఇన్‌స్పెక్షన్ సర్వే రిపోర్టు జారీ చేసేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది. కాగా తొలుత రూ.2.30 కోట్ల లంచం డిమాండ్ చేసి, ఆ తర్వాత రూ.2.20 కోట్లకు తగ్గించినట్లు ఆరోపణలు వున్నాయి. తహసీల్దార్ ఆదేశాల మేరకు సర్వేయర్ రూ.20 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సర్వేయర్ చేతి వేళ్లకు నిర్వహించిన రసాయన పరీక్షల్లో పాజిటివ్ ఫలితాలు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో సర్వేయర్ వద్ద నుంచి రూ.20 లక్షల లంచం సొమ్ము స్వాధీనం చేసుకున్నారు.అనంతరం ఇద్దరు అధికారులను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు వీరిని హాజరుపరిచారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


