ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకొని మోసం.. వ్యక్తిపై కేసు నమోదు, అరెస్ట్ రిమాండ్
డ్రగ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.30,000 వసూలు, ఉద్యోగం ఇప్పించకుండా, డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఫోన్ నంబర్ బ్లాక్., ఆదిలాబాద్ జిల్లా తలమడుగు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు.
ఆదిలాబాద్:ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి నిరుద్యోగి నుంచి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన వ్యక్తిపై తలమడుగు పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా ముప్కల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన తొకాల శివకిరణ్ తన తండ్రికి ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో హెర్నియా ఆపరేషన్ చేయించే సమయంలో భరంపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ రఫీక్ పరిచయమయ్యాడు. తాను కలెక్టరేట్‌లో పనిచేస్తున్నానని, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించగలనని నమ్మబలికాడు. ఫిర్యాదిదారుడు బీకామ్ చదివినట్లు తెలుసుకొని, వైద్య ఆరోగ్య శాఖలో డ్రగ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో ఉద్యోగం ఇప్పించేందుకు ప్రాసెసింగ్ ఖర్చులు, ఉన్నతాధికారులకు చెల్లింపుల పేరుతో రూ.80,000 డిమాండ్ చేశాడు. అతని మాటలు నమ్మిన శివకిరణ్ 24-08-2026న భరంపూర్ గ్రామానికి వెళ్లి రూ.27,000 నగదుగా చెల్లించగా, మరో రూ.3,000ను రఫీక్ సూచన మేరకు ప్రషాంత్ అనే వ్యక్తికి ఫోన్‌పే ద్వారా పంపించాడు. మొత్తం రూ.30,000 చెల్లించినప్పటికీ ఉద్యోగం ఇప్పించకపోవడంతో పాటు, డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా స్పందించకుండా ఫిర్యాదిదారుడి ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశాడు.దీంతో బాధితుడు 30 సెప్టెంబర్ న తలమడుగు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసే వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దని, ఇలాంటి ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని పోలీసులు సూచించారు. నిందితుడి వివరాలు:1. ఎం.డి. రఫీక్ @ మహమ్మద్ రఫీక్ (42), s/o మహమ్మద్ హనీఫ్, భరంపూర్ గ్రామం, తలమడుగు మండలం, ఆదిలాబాద్ జిల్లా. రెవెన్యూ శాఖలో ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేస్తూ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నాడు.కేసు వివరాలు: క్రైమ్ నంబర్ 205/2026, సెక్షన్లు 318(4), 316(5) బి ఎన్ ఎస్ నిందితుని అరెస్టు చేసే రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


