పోచమ్మ ఆలయ గద్దెల కూల్చివేతపై బస్తీవాసుల ఆగ్రహం!
ముందస్తు సమాచారం లేకుండానే తొలగించారంటూ అశోక్‌నగర్ వాసుల ఆందోళన , ఆలయ నిర్మాణానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని విజ్ఞప్తి
బెల్లంపల్లి, (మంచిర్యాలజిల్లా) తమ ఇష్టదైవమైన పోచమ్మ, మైసమ్మ ఆలయ నిర్మాణం కోసం ఏర్పాటు చేసుకున్న గద్దెలను సింగరేణి అధికారులు కూల్చివేయడంపై బెల్లంపల్లి అశోక్ నగర్ బస్తీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా సింగరేణి ఎస్అండ్పీసీ సిబ్బంది గద్దెలను తొలగించారని ఆరోపిస్తూ శుక్రవారం ఆందోళనకు దిగారు.బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రి ప్రహరీ గోడను ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో బస్తీవాసులు పోచమ్మ, మైసమ్మ ఆలయాన్ని నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు. చెత్తాచెదారంతో నిండిన స్థలాన్ని శుభ్రం చేసి, అందరూ కలిసి చిన్న గద్దెలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే శుక్రవారం ఉదయం సింగరేణి సంస్థకు చెందిన ఎస్అండ్పీసీ సిబ్బంది వాటిని కూల్చివేయడంతో స్థానికులు నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బస్తీ మహిళలు మాట్లాడుతూ.. తాము సుమారు 70 ఏళ్లుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నామని తెలిపారు. బస్తీవాసులందరి నమ్మకానికి ప్రతీకగా పోచమ్మ, మైసమ్మ ఆలయాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నామని చెప్పారు. ఆలయ గద్దెలను కూల్చివేయడం తమ మనోభావాలను దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి ఆలయ నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


