ఓట్ బచావో – దేశ్ బచావో సభకు మక్తల్ నుంచి కాంగ్రెస్ శ్రేణుల తరలింపు
ఢిల్లీ నిరసన సభకు బయలు దేరిన కాంగ్రెస్ శ్రేణులు, బస్సులకు జెండా ఊపిన మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్ : ఓట్ బచావో – దేశ్ బచావో కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న భారీ నిరసన సభకు మంత్రి వాకిటి శ్రీహరి ఇచ్చిన పిలుపు మేరకు మక్తల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. మక్తల్ నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన బస్సులను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా కార్యకర్తలతో కలిసి బస్సులో ప్రయాణిస్తూ నినాదాలు చేశారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతూ వారిలో జోష్ పెంచారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు సంరక్షణ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఢిల్లీ నిరసన సభను విజయవంతం చేసేందుకు మక్తల్ నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా తరలివెళ్లారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


