రేపు పాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో గిరిప్రదక్షిణ
బిజినపల్లి (నాగర్ కర్నూల్) : నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో కొలువుదీరిన శ్రీ అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి శనివారం నిర్వహిస్తున్న ఆలయ గిరిప్రదక్షిణ కార్యక్రమం రేపు శనివారం కూడా ఘనంగా కొనసాగనుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రతి శనివారం సాయంత్రం 6 గంటలకు స్వామివారి ఆలయం చుట్టూ నిర్వహించే ఈ గిరిప్రదక్షిణ కార్యక్రమానికి భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో రేపు సాయంత్రం 6 గంటలకు కూడా గిరిప్రదక్షిణ నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి కుటుంబ సమేతంగా గిరిప్రదక్షిణలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఏడు శనివారాలు ఏడు ప్రదక్షిణలు చేయడం ద్వారా భక్తుల కోరికలు నెరవేరుతాయని, సంతానం లేని వారికి సంతాన భాగ్యం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయనే గట్టి విశ్వాసంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. గిరిప్రదక్షిణ అనంతరం రాత్రి 7 గంటలకు స్వామివారి పల్లకీ సేవ, తీర్థప్రసాదాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. కావున పాలెం గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల భక్తులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు విజ్ఞప్తి చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


