భార్యపై అనుమానం, ఆస్తి కక్షతో అత్తపై కత్తితో హత్యాయత్నం!
ఆన్‌లైన్‌లో కత్తి కొని తెల్లవారుజామున దాడి - అల్లుడి అరెస్ట్, రిమాండ్
ములుగు : ములుగు మండలం మల్లంపల్లి గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన దారుణ ఘటన గ్రామాన్నే ఉలిక్కిపడేలా చేసింది. భార్యపై అనుమానం, ఆస్తి వివాదంతో కక్ష పెంచుకున్న అల్లుడు ఆన్‌లైన్‌లో కత్తి కొనుగోలు చేసి, అత్తపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో అత్త తీవ్ర రక్తగాయాలపాలైంది.
మల్లంపల్లి గ్రామానికి చెందిన బత్తిని సురేష్ (32, తండ్రి: చిన్న సాంబయ్య) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు దూమల రాజేష్ (37, తండ్రి: సాయిలు, వృత్తి: లారీ డ్రైవర్, ని: మల్లంపల్లి) పై హత్యాయత్నం కేసు నమోదు చేసి, నేడు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
13 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం - కలహాలతో పుట్టింటికి భార్య
ఫిర్యాదుదారుడు సురేష్ అక్క అయిన దూమల మానస (33) కు, అదే గ్రామానికి చెందిన దూమల రాజేష్‌తో 13 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలం సాఫీగా సాగిన వీరి కాపురంలో క్రమంగా అనుమానం చిచ్చు రేపింది.
కొంతకాలంగా రాజేష్ తన భార్య మానస ప్రవర్తనపై అనుమానం పెంచుకొని వేధిస్తుండటంతో, ఆమె గత ఏప్రిల్ 01.04.2026 నుండి మల్లంపల్లిలోని తన పుట్టింటి వద్దే ఉంటోంది.
ఆస్తి కోసం కక్ష
గతంలో రాజేష్ తన భార్య మానస పేరు మీద భూమి మరియు ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించాడు. ఆమె బతికుంటే తన ఆస్తి తనకు దక్కదని, అలాగే ఆమె తన అక్రమ సంబంధాలను కొనసాగిస్తుందనే కక్షతో ఆ ఆస్తిని తిరిగి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని రాజేష్ పట్టుబడుతున్నాడు.ఈ క్రమంలో నిన్న (23.11.2026) సాయంత్రం మానస ఇంటికి వచ్చి గొడవ పడి, చంపుతానని బెదిరించి వెళ్లాడు. వారిని అంతమొందించాలనే ఉద్దేశంతో నిందితుడు ఆన్‌లైన్ ద్వారా ఒక కత్తిని కొనుగోలు చేశాడు.
తెల్లవారుజామున 5:30 కు దాడి
అనంతరం ఈ రోజు (24.11.2026) ఉదయం సుమారు 05:30 గంటల సమయంలో దూమల రాజేష్ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన కత్తితో మల్లంపల్లిలోని తన అత్తగారి ఇంటికి వచ్చి తలుపులు కొట్టాడు. తలుపు తీసిన తన అత్త బత్తిని లక్ష్మి (60, భర్త: కీ.శే. సాంబయ్య) పై చంపాలనే ఉద్దేశంతో మెడపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.అడ్డుకోబోయిన భార్య మానసను కూడా కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించగా, ఆమె తప్పించుకొని బయటకు పారిపోయి కేకలు వేసింది. కేకలు విన్న ఇరుగుపొరుగు వారు అక్కడికి రావడంతో నిందితుడు కత్తితో సహా అక్కడి నుండి పరారయ్యాడు.
అత్తకు తీవ్ర గాయాలు - NSR ఆసుపత్రికి తరలింపు
ఈ దాడిలో తీవ్ర రక్తగాయాలపాలైన బత్తిని లక్ష్మిని కుటుంబ సభ్యులు, స్థానికులు చికిత్స నిమిత్తం హనుమకొండ (ఆరెపల్లి) లోని NSR ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
కత్తితో సహా నిందితుడి అరెస్ట్
దర్యాప్తులో భాగంగా ములుగు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి, పరారీలో ఉన్న నిందితుడు దూమల రాజేష్‌ను నేరానికి ఉపయోగించిన కత్తితో సహా అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి సదరు కత్తిని స్వాధీనం చేసుకుని (సీజ్ చేసి), నిందితుడిని అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా రిమాండ్‌కు తరలించడం జరిగిందని మంగళవారం ఒక ప్రకటనలో ఎస్. వెంకటేశ్, ఎస్సై ములుగు వివరించారు.అనుమానం, ఆస్తి కక్ష ఒక కుటుంబాన్ని ఎంతటి విషాదానికి గురిచేసిందో ఈ ఘటన తెలియజేస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


