చరిత్రను వక్రీకరించినవాడే చరిత్రహీనుడు!- సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఏనుగు సుదర్శన్ రెడ్డి
- గంగా, యమునా, నర్మదా పేర్లు పెట్టుకుంటారు.. మూసీ పేరు ఎవరు పెట్టుకుంటారంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధం.
- తెలంగాణ సంస్కృతి, చరిత్రపై అభిమానంతో కుమార్తెలకు ప్రత్యేక పేర్లు పెట్టుకున్న పిట్టల శ్రీశైలం కృష్ణవేణి దంపతులు
- వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం ముఖ్యమంత్రికి తగదు - ఏనుగు సుదర్శన్ రెడ్డి
ఘట్కేసర్ : చెరువుల సుందరీకరణ, పునరుద్ధరణ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు చరిత్రను వక్రీకరించేలా ఉన్నాయని మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు.
బుధవారం రాత్రి తమ్మిడికుంట పునరుద్ధరణ, పునర్జీవన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ గంగా, యమునా, నర్మదా వంటి నదుల పేర్లను తమ పిల్లలకు పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు వస్తారని, కానీ మూసీ నది పేరు పెట్టుకోవడానికి ఎవరూ ముందుకు రారని పదేపదే వ్యాఖ్యానించడం సరికాదని ఏనుగు సుదర్శన్ రెడ్డి అన్నారు.
మేడ్చల్ నియోజకవర్గం ఘట్‌కేసర్ సర్కిల్ ఎదులాబాద్ డివిజన్ అంకుషాపూర్ గ్రామానికి చెందిన పిట్టల శ్రీశైలం, కృష్ణవేణి దంపతులు తెలంగాణపై తమకున్న అపారమైన ప్రేమాభిమానాలను తమ కుమార్తెల పేర్ల రూపంలోనే చాటుకున్నారని ఆయన గుర్తుచేశారు. వారి పెద్ద కుమార్తెకు ‘తెలంగాణ కోకిల’ అని, చిన్న కుమార్తెకు మూసీ నది ప్రాచీన నామమైన ‘ముచ్కుంద (మూసీ)’ అని పేరు పెట్టుకోవడం తెలంగాణ చరిత్ర, సంస్కృతి, నదుల పట్ల వారికున్న గౌరవానికి నిదర్శనమని పేర్కొన్నారు.
మూసీ నది పరిరక్షణ, పునరుజ్జీవనం కోసం నిరంతరం గళమెత్తుతూ, ఆ నదిపై తమకున్న అభిమానాన్ని తమ బిడ్డ పేరుతోనే చరిత్రలో నిలిచేలా చేసిన ఆ తల్లిదండ్రుల స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అభినందించాలని అన్నారు. తెలంగాణ కోకిల, ముచ్కుంద అనే పేర్లు పెట్టుకోవడం ద్వారా తెలంగాణ అస్తిత్వం, ప్రకృతి సంపద, నదుల వారసత్వం పట్ల తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని వారు చాటిచెప్పారని తెలిపారు.
ఈ సందర్భంగా ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, మూసీ నదిపై ప్రేమ లేదని, దాని పేరు పెట్టుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ముఖ్యమంత్రి మాట్లాడటం వాస్తవాలను విస్మరించడమే. ముఖ్యమంత్రి గారు ఒక్కసారి అంకుషాపూర్‌కు చెందిన పిట్టల శ్రీశైలం, కృష్ణవేణి దంపతుల కుటుంబం గురించి తెలుసుకోవాలి. తెలంగాణపై అభిమానంతో ఒక కుమార్తెకు తెలంగాణ కోకిల అని, మరో కుమార్తెకు ముచ్కుంద (మూసీ) అని పేరు పెట్టిన కుటుంబం మన మధ్యే ఉంది. ఈ విషయాన్ని తెలుసుకోకుండా సభల్లో వ్యాఖ్యలు చేయడం తగదు” అని అన్నారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడేటప్పుడు చరిత్రను, వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలని, ప్రజల భావోద్వేగాలను గౌరవించాలని సూచించారు. తెలంగాణ నదుల పట్ల ప్రేమను నిరూపించుకోవడానికి పేర్ల గురించి వ్యాఖ్యలు చేయడం కంటే వాటి పరిరక్షణకు నిజాయితీగా కృషి చేయడం ముఖ్యమని పేర్కొన్నారు.
చరిత్రను తెలుసుకోకుండా వక్రీకరించి మాట్లాడేవారే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. తెలంగాణ చరిత్రను, సంస్కృతిని, మూసీ నది వారసత్వాన్ని గౌరవించాలి. అంకుషాపూర్‌కు చెందిన పిట్టల శ్రీశైలం, కృష్ణవేణి దంపతుల కుటుంబం ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిలువెత్తు సమాధానమని ఏనుగు సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర కోఆర్డినేటర్ సభ్యుడు,పిఎంఇజిపి సేల్ కో కన్వీనర్ కప్పర గళ్ళ కరుణాకర్, మాజీ ఉపసర్పంచ్ మాయ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


