తాటికొండ క్రాస్ రోడ్డు వద్ద కారులో అగ్నిప్రమాదం
స్టేషన్ ఘన్‌పూర్, : స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని తాటికొండ క్రాస్‌రోడ్డు వద్ద గురువారం చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో నిస్సాన్ టెర్రానో కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అప్రమత్తమై వెంటనే బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే హన్మకొండ లోని సుబేదారి ప్రాంతానికి చెందిన ఎండీ అన్వర్ హుస్సేన్ మరో వ్యక్తితో కలిసి నిస్సాన్ టెర్రానో కారులో మల్లన్నగండికి బయలుదేరారు. ఈ క్రమంలో తాటికొండ క్రాస్‌రోడ్డు వద్దకు చేరుకోగానే కారు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు రావడం ప్రారంభమైంది. దీంతో అప్రమత్తమైన ఇద్దరూ వెంటనే కారు నుంచి బయటకు దిగారు. కొద్దిసేపటికే మంటలు వేగంగా వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. కొత్తగా ర్యాపింగ్ చేయించిన మరుసటి రోజే కారు అగ్నికి ఆహుతి కావడం గమనార్హం. ప్రమాదంపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. రహదారిపై కారు దగ్ధం కావడంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


