డాక్టర్ బదిలీతో చీకోడ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో వైద్య సేవలకు బ్రేక్!
వైద్యుడు లేక బీపీ, షుగర్, కీళ్ల నొప్పుల బాధితుల అవస్థలు
పాపన్నపేట : మండల పరిధిలోని చీకోడ్ గ్రామంలో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం (ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ)లో వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల జరిగిన వైద్యుల బదిలీల్లో భాగంగా ఈ కేంద్రానికి క్రమం తప్పకుండా వచ్చి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ బదిలీ కావడంతో ప్రస్తుతం డిస్పెన్సరీలో వైద్య సేవలు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. గతంలో డాక్టర్ అందుబాటులో ఉండటంతో బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న గ్రామీణులు వైద్య సేవలు పొందేవారు. అయితే ప్రస్తుతం వైద్యుడు లేకపోవడంతో చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ప్రభుత్వ వైద్య కేంద్రంలో వైద్యుడు లేకపోవడం పట్ల గ్రామ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత వైద్యాధికారులు, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి చీకోడ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరానికి శాశ్వతంగా లేదా ప్రత్యామ్నాయంగా వైద్యుడిని నియమించి వైద్య సేవలను పునరుద్ధరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


