ఆదిలాబాద్ లోఘనంగా పండుగ సాయన్న జయంతి ఉత్సవాలు.. కలెక్టర్ రాజర్షి షా, మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్.
జిల్లా కేంద్రంలో గురువారం పండుగ సాయన్న జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. వేడుకల్లో భాగంగా ద్వారకానగర్ రోడ్ లోని పండుగ సాయన్న విగ్రహానికి, కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయన్న చిత్రపటానికి జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎంపీ గోడం నగేష్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష ముఖ్య అతిథులుగా హాజరై నివాళులు అర్పించి స్మరించుకున్నరు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్ణయం మేరకు పండుగ సాయన్న జయంతి వేడుకలను ప్రతి జిల్లాలో అధికారికంగా నిర్వహించడం ఎంతో సంతోషకరమని తెలిపారు. యువకులు, విద్యార్థులు పండుగ సాయన్న జీవిత చరిత్రను తెలుసుకొని, వారి బోధనలను నిత్య జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల కోసం, అణచివేతకు వ్యతిరేకంగా పండుగ సాయన్న చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జిల్లాలో బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా ఎస్సై, కానిస్టేబుల్, ఫౌండేషన్ కోర్సులకు దాదాపు 200 మందికి పైగా యువతకు ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో ముదిరాజ్ సంఘం సభ్యులు, మత్స్యకార సంఘాల నాయకులు లేవనెత్తిన స్థలాలు, షెడ్లు, మత్స్యకార సొసైటీల సమస్యలు, చెరువులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు తదితర అంశాలపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమస్యలను సంబంధిత డిపార్ట్మెంట్ల వారీగా సమీక్షించి, డీఎస్సీడీఓ సహకారంతో త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు.
ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ, చరిత్రలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, వారి హక్కుల పరిరక్షణకు పాటుపడిన గొప్ప నేత పండుగ సాయన్న అని కొనియాడారు. గతంలో పేద, చిన్న వర్గాల పక్షాన నిలిచి, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఎదిరించిన వారిని కొందరు తీవ్రవాదులుగా ముద్ర వేసేవారని గుర్తుచేశారు. సమాజంలో మార్పు కోసం శ్రమించిన వారి జీవిత చరిత్రలను అధ్యయనం చేసి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళితే తగిన గుర్తింపు లభిస్తుందని తెలిపారు. సాయన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి, ఆయనను అధికారికంగా గుర్తించడం ఎంతో సంతోషకరమని ఎంపీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జి బిసి సంక్షేమ అధికారి సునీత కుమారి, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాములు, రవి, బిసి సంఘాల ప్రజాప్రతినిధులు శ్రీనివాస్, వివిధ సంఘాల నాయకులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


