కార్పొరేట్ మెడికల్ బోర్డు ఫలితాలపై పునఃసమీక్ష చేయాలి
కొత్తగూడెం, :ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించిన సింగరేణి కార్పొరేట్ మెడికల్ బోర్డు ఫలితాలను పునఃసమీక్షించి అనారోగ్య కార్మికులకు న్యాయం చేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటీయూసీ) యాజమాన్యాన్ని డిమాండ్ చేసింది. మెడికల్ బోర్డును రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కోరుతూ మంగళవారం సింగరేణి వ్యాప్తంగా అన్ని గనులు, విభాగాల్లో వినతిపత్రాలు సమర్పించింది. ఎఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ పిలుపు మేరకు కొత్తగూడెం ఏరియాలోని అన్ని గనులు, విభాగాల్లో నాయకులు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సింగరేణి వ్యాప్తంగా సుమారు 2,000 మంది కార్మికులు ఏళ్లుగా మెడికల్ బోర్డు కోసం ఎదురుచూస్తుండగా, కేవలం 120 మందికి మాత్రమే బోర్డు నిర్వహించడం అన్యాయమని విమర్శించారు. వారిలో 28 మందికి మెడికల్ బోర్డుకు హాజరు కావాల్సిన సమాచారం సకాలంలో అందకపోవడం యాజమాన్య నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. హాజరైన 120 మంది కార్మికుల్లో కేవలం 24 మందిని మాత్రమే ఇన్వాలిడేషన్‌కు అర్హులుగా ప్రకటించడం గత మెడికల్ బోర్డులతో పోలిస్తే చాలా తక్కువ శాతమని తెలిపారు. ముఖ్యంగా భూగర్భ గనుల్లో దశాబ్దాలుగా పనిచేస్తున్న కార్మికులు కీళ్ల నొప్పులు, వెన్నెముక సమస్యలు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నప్పటికీ, వారి ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా పరిగణనలోకి తీసుకోకుండా ఫలితాలు ప్రకటించడం వల్ల నిజంగా అనారోగ్యంతో ఉన్న కార్మికులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో దరఖాస్తు చేసుకుని ఇప్పటికీ మెడికల్ బోర్డు కోసం ఎదురుచూస్తున్న కార్మికులందరికీ వెంటనే మరోసారి కార్పొరేట్ మెడికల్ బోర్డు నిర్వహించాలని, ప్రతి కార్మికుడి ఆరోగ్య పరిస్థితిని నిష్పాక్షికంగా పరిశీలించి అర్హులైన వారిని ఇన్వాలిడేషన్ చేసి, వారి వారసులకు ఉద్యోగాలు కల్పించాలని ఎఐటీయూసీ నాయకులు యాజమాన్యాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సహాయ కార్యదర్శి గట్టయ్య, ఉపాధ్యక్షులు కత్తర్ల రాములు, ఆఫీస్ బేరర్లు సందబోయిన శ్రీనివాస్, హీరాలాల్, కర్రు రమేష్, గుమ్మడి వీరయ్య, పిట్ కార్యదర్శులు ఎం.ఆర్.కే. ప్రసాద్, మధుకృష్ణ, కమల్, సురేందర్‌తో పాటు రాజాలపూడి సాంబమూర్తి, బండారి మల్లయ్య, సాయి పవన్, సందీప్, శశివర్ధన్ రెడ్డి, సురేంద్రరెడ్డి, వెంకటరమణ, కుమార్ రావు, మురళి, అప్పారావు, కొవ్వూరు రాజేశ్వరరావు, అవినాష్, గావిని నాగరాజు, సుబ్రమణ్యం, మెంగన్ రవి, కోటి, ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Views: 101
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 18:14:10
హైదరాబాద్: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
