ప్రతి పేదవాడికి విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు.. మంత్రి దామోదర రాజనర్సింహ చేయూత పింఛన్లతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, కల్లుగీత, చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా
చౌటకూర్, :- సమాజంలోని ప్రతి పేదవాడికి విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం చేయూత పింఛన్లు మంజూరు చేస్తోందని తెలిపారు.సోమవారం అందోల్ మండలం సంగుపేట ఎక్స్ రోడ్డులోని శ్రీలక్ష్మీదేవి గార్డెన్స్‌లో నిర్వహించిన నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందోల్-జోగిపేట మున్సిపాలిటీతో పాటు అందోల్, చౌటకూర్, పుల్కల్, వట్పల్లి మండలాలకు చెందిన నూతన పింఛన్ లబ్ధిదారులకు మంజూరు ప్రొసీడింగ్స్‌ను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4.50 లక్షల చేయూత పింఛన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 18 వేలకుపైగా, అందోల్ నియోజకవర్గంలో 3 వేలకుపైగా నూతన పింఛన్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, కల్లుగీత, చేనేత కార్మికులకు ఈ పింఛన్లు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు గౌరవప్రదమైన జీవనం సాగించేందుకు తోడ్పడతాయని అన్నారు.పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇళ్ల పథకం వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. అందోల్ నియోజకవర్గంలో 4 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు సుమారు వెయ్యి ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. సొంత స్థలం ఉన్న పేదలకు ఇళ్లు మంజూరు చేయడంతో పాటు, స్థలం లేని నిరుపేదలకు కూడా ఇళ్లు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించి కోటీశ్వరులుగా ఎదగాలనే లక్ష్యంతో మహిళా సంఘాలకు పెద్దఎత్తున బ్యాంకు లింకేజీ రుణాలు, వడ్డీలేని రుణాలు అందిస్తూ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మంత్రి తెలిపారు. మహిళా సంఘాలు తీసుకున్న రుణాలపై వడ్డీ చెల్లించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటోందన్నారు. ఇందిరమ్మ క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, డ్రోన్ల నిర్వహణ వంటి వివిధ రంగాల్లో మహిళలకు అవకాశాలు కల్పిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతోందని చెప్పారు. హుమ్నాపూర్‌లో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
అందోల్ నియోజకవర్గాన్ని విద్యా హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. యువతకు నాణ్యమైన విద్యతో పాటు నైపుణ్యాలను అందించి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అందోల్ గుట్ట వద్ద రూ.60 కోట్లతో ఫార్మసీ కళాశాల, అందోల్‌లో రూ.35 కోట్లతో న్యాయ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. త్వరలో నర్సింగ్ కళాశాలను కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా బాలికలు ఉన్నత విద్యను అభ్యసించి, నైపుణ్యాలను పెంపొందించుకుని పోటీ ప్రపంచంలో ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు.
యువతకు స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అందోల్ నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ ప్రాంతంలో కనీసం 10 నుంచి 15 పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని పేర్కొన్నారు. సింగూరు, అందోల్ ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. మెట్ట ప్రాంతాలకు సైతం సాగునీరు అందించాలనే లక్ష్యంతో పెద్దారెడ్డిపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమాంతరంగా కొనసాగిస్తూ ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.
చివరి వ్యక్తికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యం: కలెక్టర్
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ సమాజంలోని చివరి వ్యక్తికి సైతం సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం 1,48,562 మంది లబ్ధిదారులకు ప్రతి నెలా రూ.32.73 కోట్ల పింఛన్లు అందిస్తున్నట్లు వివరించారు. తాజాగా మరో 18,591 మందికి నూతనంగా చేయూత పింఛన్లు మంజూరు చేయగా, వీరికి ప్రతి నెలా రూ.4.24 కోట్ల పింఛన్ అందించనున్నట్లు తెలిపారు.అందోల్ నియోజకవర్గంలో కొత్తగా 3,130 మందికి చేయూత పింఛన్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి హాజరుకాలేక మంజూరు ప్రొసీడింగ్స్ పొందని లబ్ధిదారులు సంబంధిత మండల కార్యాలయాల్లో వాటిని తీసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాండు, ఆర్డీవో రమేష్ బాబు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి జగదీష్, డీఆర్డీఏ ఏపీడీ సూర్యారావు, మున్సిపల్ కమిషనర్, అందోల్, చౌటకూర్ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోడపట్ల గణేష్ ముదిరాజ్, పుల్కల్, చౌటకూర్ మండలాల తహసీల్దార్లు విజయలక్ష్మి, ఎంపీడీవో కె. శంకర్, సంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు నందికంటి రామచంద్ర, సర్పంచులు మల్లారెడ్డి, గొల్ల మల్లేశం, చంటి గీతా రమేష్, పార్కుల రాంరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, నూతన పింఛన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


