విద్యార్థినుల భద్రతకు ‘షీ బాక్సులు’ పుల్కల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు
చౌటకూర్ : పుల్కల్ మండలం విద్యార్థినుల భద్రతకు, మహిళలపై వేధింపుల నివారణకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని హెడ్ కానిస్టేబుల్ సుందర్ రాజ్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా పుల్కల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం షీ బాక్సులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు మహిళల హక్కులు, భద్రత, చట్టపరమైన రక్షణ చర్యలపై అవగాహన కల్పించారు.షీ బాక్సుల ద్వారా విద్యార్థినులు తమ సమస్యలను నేరుగా పోలీసుల దృష్టికి తీసుకువచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. తమకు ఎదురైన ఇబ్బందులు, వేధింపులు, ఇతర సమస్యలను ఒక కాగితంపై రాసి షీ బాక్సులో వేయాలని సూచించారు. ఈ బాక్సుల్లో వేసిన ఫిర్యాదులను పోలీసులు ఎప్పటికప్పుడు సేకరించి పరిశీలిస్తారని, ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతూ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని వివరించారు. దీనివల్ల విద్యార్థినులు తమ గుర్తింపును బయటపెట్టకుండానే సమస్యలను తెలియజేసే అవకాశం ఉంటుందన్నారు.విద్యార్థినులు కళాశాలలో కానీ, బయట కానీ ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా ధైర్యంగా ముందుకు రావాలని సూచించారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, ఆకతాయిలు వేధింపులకు పాల్పడినా, సామాజిక మాధ్యమాల ద్వారా ఇబ్బందులకు గురిచేసినా పోలీసుల దృష్టికి తీసుకువస్తే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.సోషల్ మీడియాను వినియోగించేటప్పుడు వ్యక్తిగత వివరాలు, ఫొటోలు, ఫోన్ నంబర్లను అపరిచితులతో పంచుకోవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మహిళా కానిస్టేబుల్ సరస్వతి, కళాశాల ప్రిన్సిపల్ అవనీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


