ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు!
* శివ్వంపేట గ్రామంలో అక్రమ నిర్మాణంపై చర్యలు ఎప్పుడు? * మూడు వారాలుగా లష్కర్లను పంపిస్తూ కాలయాపన చేస్తున్నారంటూ గ్రామ యువకుల ఆవేదన
చౌటకూర్, : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివ్వంపేట గ్రామంలో బీర్ పరిశ్రమకు ఎదురుగా జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమ నిర్మాణం, ఇరిగేషన్ బఫర్ జోన్ మరియు నక్ష బాట ఆక్రమణ సమస్యపై అధికారులు స్పందించడం లేదని గ్రామ యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం గతంలో 07-08-2026న ప్రజావాణిలో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంపై గ్రామ యువకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గత మూడు వారాలుగా చౌటకూర్ మండల ఇరిగేషన్ అధికారి క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించకుండా, కేవలం లష్కర్లను మాత్రమే పంపిస్తూ కాలయాపన చేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు.ఈ క్రమంలో సోమవారం (16-11-2026) మరోసారి ప్రజావాణిలో వినతిపత్రం అందజేసి, ఇరిగేషన్ బఫర్ జోన్ మరియు నక్ష బాట వివరాలపై స్పష్టత ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా, పలుమార్లు విన్నవించినా శాశ్వత పరిష్కారం చూపకపోతే సామాన్య ప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని యువకులు ప్రశ్నిస్తున్నారు.సంబంధిత అధికారులు కేవలం కిందిస్థాయి సిబ్బందిని పంపించడంతో సరిపెట్టకుండా స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని వారు కోరుతున్నారు. బఫర్ జోన్ పరిధి, నక్ష బాట రికార్డుల ఆధారంగా సదరు నిర్మాణం నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా అన్నది తేల్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపైనా చర్యలు తీసుకొని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని శివ్వంపేట గ్రామ యువకులు కోరుతున్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


