అంతర్రాష్ట్ర రహదారిపై ధాన్యం ఆరబెట్టడం ప్రమాదకరం!
రహదారులపై వరి ధాన్యం.. వాహనదారుల ప్రాణాలకు ముప్పు – ప్రమాదాలు జరుగుతున్నా మారని తీరు!
మిడ్జిల్ : మిడ్జిల్ పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు వరి ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అంతర్రాష్ట్ర రహదారులను వినియోగించడం వాహనదారులకు ప్రాణసంకటంగా మారుతోంది. రహదారులపై వరి ధాన్యాన్ని ఆరబెట్టడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడమే కాకుండా, ద్విచక్ర వాహనదారులు ధాన్యంపై జారిపడి ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ధాన్యం కనిపించక వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఈ తరహా నిర్లక్ష్యం కారణంగా వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటుండటం ఆందోళన కలిగిస్తోంది. రైతులు తమ పంటను కాపాడుకోవాలనే ఉద్దేశంతో రహదారులపై ధాన్యం ఆరబెడుతున్నప్పటికీ, అదే సమయంలో ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టకూడదని ప్రజలు సూచిస్తున్నారు. రైతులకు విజ్ఞప్తి: వరి ధాన్యాన్ని రహదారులపై కాకుండా సొంత కల్లాలు, ఖాళీ స్థలాలు, వ్యవసాయ పొలాల్లో ఆరబెట్టుకోవాలి. రహదారులపై ధాన్యం ఆరబెట్టడం వల్ల ప్రమాదం జరిగితే ప్రాణనష్టం సంభవించడమే కాకుండా ఇతరుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధికారులు స్పందించాలి: సంబంధిత అధికారులు, పోలీస్ శాఖ, గ్రామపంచాయతీ అధికారులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రహదారులపై ధాన్యం ఆరబెట్టకుండా చర్యలు తీసుకోవాలి. అవసరమైన చోట హెచ్చరికలు జారీ చేసి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలి. రైతుల కష్టాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి.. అదే సమయంలో ప్రయాణికుల ప్రాణాల భద్రతకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. రహదారులు ప్రయాణానికి మాత్రమే.. ధాన్యం ఆరబెట్టడానికి కాదు! ప్రజలు, రైతులు, అధికారులు సమన్వయంతో వ్యవహరించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని వాహనదారులు కోరుతున్నారు. – విజన్ ఆంధ్ర
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


