గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
మెదక్ , నర్సాపూర్ పట్టణంలోని NH-765D జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 64 సంవత్సరాల వృద్ధుడు మృతి చెందిన ఘటనపై నర్సాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే, నర్సాపూర్ పట్టణంలోని శివాలయం వీధికి చెందిన వడ్డె ఎల్లయ్య( 64 ) ఈ నెల 22 రాత్రి సుమారు 11:00 గంటల సమయంలో తన TVS XL ద్విచక్ర వాహనం పై సిగరెట్ కొనుగోలు చేసేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో 23 నాడు రాత్రి సుమారు 02:45 గంటల సమయంలో నర్సాపూర్ పట్టణంలోని బాలాజీ ఫుట్‌వేర్ షాపు ఎదురుగా, మెదక్ వైపు వెళ్లే NH-765D రహదారిపై గుర్తుతెలియని వాహనం ఆయన ద్విచక్ర వాహనాన్ని ఢీకొని, తలకు, కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన వాహనం ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న నర్సాపూర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ఎల్లయ్యను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి, నర్సాపూర్‌కు తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని తదుపరి చట్టపరమైన ప్రక్రియ నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు వడ్డె అంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో యస్.ఐ. రంజిత్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు, మరియు ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని వాహనాన్ని, దాని డ్రైవర్‌ను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సంఘటనా స్థల పరిసరాల్లోని CCTV ఫుటేజీ ని పరిశీలించడం ద్వారా ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు. నర్సాపూర్ పోలీసుల విజ్ఞప్తి: ఈ ప్రమాదానికి సంబంధించి ఎవరికైనా సమాచారం తెలిసి ఉంటే లేదా ప్రమాద సమయంలో ఆ మార్గంలో ప్రయాణించిన వాహనాలకు సంబంధించిన వివరాలు, CCTV దృశ్యాలు అందుబాటులో ఉంటే నర్సాపూర్ పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని కోరుతున్నాము. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతాము. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు క్షతగాత్రులకు తక్షణ సహాయం అందించాలి. ప్రమాదానికి కారణమైన వాహనంతో సహా అక్కడి నుంచి పరారవడం చట్టరీత్యా నేరం. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని నర్సాపూర్ పోలీసులు సూచిస్తున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


