చెన్నూరును పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం
గోదావరి తీరంలో రూ.17 కోట్లతో శివాలయం అభివృద్ధి , పుష్కరాల కోసం చెన్నూరుకు రూ.70 కోట్ల నిధులు
శక్తి, గనుల శాఖ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి
చెన్నూరు : చెన్నూరు పట్టణాన్ని పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని శక్తి, గనుల శాఖ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ చెన్నూరు రూపురేఖలను మారుస్తున్నామని చెప్పారు. సోమవారం పట్టణంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.
*చిరువ్యాపారులకు నష్టం కలగకుండా రోడ్డు విస్తరణ*
చెన్నూరులో దీర్ఘకాలంగా ఉన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి స్థానిక వ్యాపారుల విజ్ఞప్తి మేరకు రోడ్డు విస్తరణ చేపట్టినట్లు మంత్రి తెలిపారు. తొలుత రూ.1.5 కోట్లతో బైపాస్ రోడ్డును రికార్డు సమయంలో పూర్తి చేశామని చెప్పారు. రోడ్డు విస్తరణలో ఏ ఒక్క చిరువ్యాపారీ నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గతంలో దుకాణాలు తొలగించి తిరిగి నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చినా అమలు చేయలేదని, తమ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఇందులో భాగంగా రూ.1.2 కోట్లతో 20 కొత్త దుకాణాల నిర్మాణానికి భూమిపూజ చేసినట్లు వెల్లడించారు. నాలుగు నెలల్లో వీటి నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, మిగిలిన అర్హులైన చిరువ్యాపారుల కోసం త్వరలో మరో 50 ఆధునిక దుకాణాలు నిర్మించి అందిస్తామని హామీ ఇచ్చారు.
*మూడు నెలల్లో ప్రధాన రహదారి విస్తరణ పూర్తి*
చెన్నూరు ప్రధాన రహదారి విస్తరణ పనులను మరో మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పట్టణంలోని 10వ వార్డులో రూ.3.5 కోట్లతో 750 మీటర్ల మేర రోడ్డు విస్తరణ చేపడుతున్నామని, డబుల్ ఆర్మ్ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. TUFIDC నిధులతో పట్టణంలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. రాబోయే ఆరు నెలల్లో పట్టణంలోని ప్రధాన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని వివరించారు.
*పుష్కరాల అభివృద్ధికి రూ.70 కోట్లు*
గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని చెన్నూరు అభివృద్ధికి రూ.70 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు మంత్రి వెల్లడించారు. చెన్నూరుకు అధిక నిధులు తీసుకురావడానికి ప్రభుత్వంతో చర్చించి ప్రత్యేకంగా కృషి చేశామని తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


