గ్రాడ్యుయేట్లలో తగ్గిన జోష్.. MLC ఓటరు నమోదుకు తూతూ మంత్రంగా స్పందన!
2021తో పోలిస్తే సగానికి పడిపోయిన దరఖాస్తులు - నవంబర్ 6తో ముగియనున్న గడువు
తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఊహించని పరిణామం చోటు చేసుకుంటోంది. గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు ప్రక్రియలో గ్రాడ్యుయేట్ల నుండి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. దీంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది.
10 లక్షల నుండి 5 లక్షలకు పడిపోయిన గ్రాఫ్:
2021లో జరిగిన పట్టభద్రుల MLC ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10.36 లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ఆ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద హీట్ ను క్రియేట్ చేశాయి. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 5.24 లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. అంటే గతంతో పోలిస్తే దాదాపు 50 శాతం దరఖాస్తులు తగ్గిపోయినట్లే.
రెండు నియోజకవర్గాల లెక్కలు ఇలా:
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, అత్యంత కీలకమైన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ (HYD-RR-MBNR) నియోజకవర్గానికి కేవలం 2.29 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అదే విధంగా వరంగల్-నల్గొండ-ఖమ్మం (WGL-NLG-KMM) నియోజకవర్గానికి 2.93 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
గడువు దగ్గర పడుతున్నా పెరగని సంఖ్య:
నవంబర్ 6వ తేదీతో ఓటరు నమోదు గడువు ముగియనుంది. గడువు సమీపిస్తున్నా దరఖాస్తుల సంఖ్యలో పెద్దగా పెరుగుదల లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
కారణం ఏంటి?
గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుపై ఆశించిన స్థాయిలో ఆసక్తి కనిపించకపోవడానికి ప్రధాన కారణం ఎన్నికల సంఘం సరిగా ప్రచారం చేయకపోవడమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. గతంలో మాదిరిగా కళాశాలలు, యూనివర్సిటీల్లో అవగాహన కార్యక్రమాలు జరగడం లేదని, ఆన్‌లైన్ ప్రక్రియపై సరైన అవగాహన లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు. మరోవైపు గ్రాడ్యుయేట్లలో రాజకీయాలపై ఆసక్తి తగ్గిందా? అనే కోణంలో కూడా చర్చ జరుగుతోంది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


