రైతుల ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై మఠం భిక్షపతి ఆగ్రహం
రైతుల కన్నీళ్లకు బాధ్యత ఎవరిది? సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి.. నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలి
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం కేంద్రంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం భిక్షపతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతులు ధాన్యం విక్రయించుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.రైతులు ఎంతో కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో భారీగా ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయని మఠం భిక్షపతి పేర్కొన్నారు. మరోవైపు అకాల వర్షాలు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయని, కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం వర్షాలకు తడిసి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఎప్పుడు లభిస్తుందని, ధాన్యం కొనుగోళ్లు ఎప్పుడు వేగవంతం చేస్తారని ఆయన ప్రశ్నించారు. కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంతో రైతులు పడుతున్న ఇబ్బందులకు బాధ్యత ఎవరిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీశారు.రైతులు రేయింబవళ్లు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ఉంచాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయాలని, అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను గుర్తించి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


