గ్రామాభివృద్ధికి సహకారం ప్రశంసనీయం
కంచుపాడు లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన రాష్ట్ర మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరి
అలంపూర్ : నడిగడ్డలోని సురవరం కుటుంబానికి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, కంచుపాడు గ్రామంలో వారి కుటుంబ సభ్యుల సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళ, శిశు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి మండలం కంచుపాడు గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, ఆలంపూర్ శాసనసభ్యులు విజేయుడుతో కలిసి మంత్రి సీతక్క శంకుస్థాపనలు చేశారు. 44వ జాతీయ రహదారి నుంచి కంచుపాడుకు రూ.3 కోట్ల నిధులతో నిర్మించనున్న బీటీ రహదారికి, విబి జీరాంజీ పథకంలో భాగంగా రూ.30.22 కోట్ల నిధులతో ఆలంపూర్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టే 323 పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం గ్రామంలోని సురవరం వెంకట్రామిరెడ్డి విజ్ఞాన కేంద్రాన్ని ప్రజాప్రతినిధులు సందర్శించారు. ఇక్కడి సురవరం సుధాకర్ రెడ్డి హాల్, గ్రంథాలయం, క్రీడ, నైపుణ్య అభివృద్ధి శిక్షణ విభాగాలను కలియ తిరుగుతూ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, రాష్ట్ర గొర్రెలు, మేకలు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ సరిత, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, గ్రామ సర్పంచ్ నాగ లక్ష్మమ్మ, విజ్ఞాన కేంద్రం ప్రతినిధి విజయలక్ష్మి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


