సుల్తాన్‌పూర్, గూంగోల్ తాండ శివార్లలో రాత్రివేళ జోరుగా అక్రమ మొరం తవ్వకాలు!
ప్రైవేట్ వెంచర్లకు యథేచ్ఛగా తరలింపు.. పట్టించుకోని అధికారులు విచారణ చేపట్టి అక్రమ తవ్వకాలను అరికట్టాలని గ్రామస్తుల డిమాండ్
చౌటకూర్: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని సుల్తాన్‌పూర్, గూంగోల్ తాండ శివారు ప్రాంతాల్లో రాత్రివేళ అక్రమ మొరం తవ్వకాలు, రవాణా జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రాత్రి 10 గంటల తర్వాత జేసీబీలతో మొరం తవ్వకాలు చేపట్టి, ట్రాక్టర్లు మరియు టిప్పర్ల ద్వారా సమీపంలోని ప్రైవేట్ వెంచర్లకు తరలిస్తున్నారని స్థానిక గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.పగటిపూట ప్రశాంతంగా కనిపించే ఈ ప్రాంతాల్లో చీకటి పడిందంటే చాలు మొరం తరలించే వాహనాల రద్దీ పెరుగుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. రాత్రివేళ యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మొరం తవ్వకాల వల్ల భూమి స్వరూపం పూర్తిగా మారిపోవడమే కాకుండా, పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. భూమి పైపొరలను విచ్చలవిడిగా తవ్వేయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని, భవిష్యత్తులో తాగునీరు, సాగునీటి సమస్యలు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు స్పందించి సుల్తాన్‌పూర్, గూంగోల్ తాండ శివారు ప్రాంతాల్లో జరుగుతున్న మొరం తవ్వకాలపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. రాత్రివేళ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఎటువంటి అనుమతులు లేకుండా మొరం తవ్వకాలు, రవాణా చేస్తున్న వారిపై మరియు వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

