ఎల్ నినో వల్ల తాగు నీరు, పశుసంపద పై ప్రభావం - అదనపు కలెక్టర్ నగేష్
మెదక్, : ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వ్యవసాయం, తాగునీరు, పశుసంపదపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో సూచించడం జరిగింది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గి రైతాంగానికి, ప్రజలకు తీవ్ర సమస్య వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ మంచినీటిని పొదుపుగా వినియోగించాలని, నల్లాల ద్వారా నీటిని వృథా చేయరాదని సూచించారు. మురుగునీరు వృథాగా పోకుండా ఇంకుడు గుంతలు నిర్మించుకొని, వాటి ద్వారా నీటిని భూమిలోకి ఇంకించేలా చర్యలు తీసుకోవాలన్నారు. భూగర్భ జలమట్టాలు మరింత పడిపోయి బోరుబావులపై ప్రభావం పడుతుందని తెలిపారు. వరి పంట సాగు చేయొద్దను,తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలు,ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని ఆదేశించారు.సింగూరు సహా ఇతర రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గి తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉందన్నారు. సాగునీటి అవసరాలకు విద్యుత్ వినియోగం పెరగడంతో విద్యుత్ సరఫరాపైనా ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని వివరించారు. మేత, నీటి కొరత కారణంగా పశువుల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. రైతులు ఫామ్ ఆయిల్ సాగును ప్రోత్సహించాలని, 25 ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేసే రైతులకు సోలార్ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. రైతులు అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. పశుసంపద సంక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ గారు, ఎంపీఓ మహమ్మద్ మొజామ్ హుస్సేన్,మండల వ్యవసాయ అధికారిణి దీపిక,సర్పంచ్ చంద్రకళ,ఉపసర్పంచ్ రవి, ఉద్యానవన విస్తరణ అధికారి గోవింద్,పంచాయతీ కార్యదర్శి , టీఏ, వెటర్నరీ అధికారి అంజనేయులు, అంగన్వాడీ టీచర్ , ఆశా కార్యకర్త,వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

