భారత రాజ్యాంగమే ప్రజాస్వామ్య బలం : కాకులమర్రి లక్ష్మణ్ బాబు
ములుగు : రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం ములుగు జిల్లా కేంద్రంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి, విగ్రహానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యున్నత లిఖిత రాజ్యాంగాన్ని దేశానికి అందించిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగం కుల, మత, వర్గ భేదాలు లేకుండా ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సౌభ్రాతృత్వం కల్పించిందని అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ చేసిన త్యాగాలు నేటికీ దేశ ప్రగతికి మార్గదర్శకమని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే ప్రత్యేక తెలంగాణ కల సాకారమైందని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లో 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించి, సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి దళితుల ఆత్మగౌరవాన్ని పెంచారని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలను కూడా నిర్వర్తిస్తూ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దళిత నాయకులు, వివిధ దళిత సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని “భారత రాజ్యాంగం వర్ధిల్లాలి - జై భీమ్” అంటూ నినాదాలు చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


