హైదరాబాద్ చేపల మార్కెట్లలో 420 కిలోల కుళ్లిన చేపలు
బేగంబజార్, రాంనగర్ మార్కెట్లలో టీజీ సేఫ్ అధికారుల తనిఖీలు.. లైసెన్సులు లేకుండా వ్యాపారాలు, అపరిశుభ్ర పరిస్థితులు గుర్తింపు
హైదరాబాద్, : నగరంలోని చేపల మార్కెట్లలో ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్న కుళ్లిన చేపల విక్రయాలపై టీజీ సేఫ్ (TG SAFE) ఫుడ్ వింగ్ అధికారులు కొరడా ఝళిపించారు. శుక్రవారం బేగంబజార్, ముషీరాబాద్‌లోని రాంనగర్ చేపల మార్కెట్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 420 కిలోల కుళ్లిన, పాడైపోయిన చేపలను గుర్తించి ధ్వంసం చేశారు. పలు దుకాణాలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఫుడ్ సేఫ్టీ లైసెన్సులు లేకుండానే వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించి నోటీసులు జారీ చేశారు.
బేగంబజార్‌లో 70 కిలోల చేపలు ధ్వంసం
బేగంబజార్‌లోని జీఎన్‌బీ శ్రీ శ్రీనివాస ఫిష్ మర్చంట్ దుకాణంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. చేపల్లో ఫార్మాలిన్, నైట్రేట్స్ ఉన్నాయా అనే అంశంపై అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించారు. అధికారుల పరిశీలన, వెటర్నరీ అధికారి అభిప్రాయం మేరకు 70 కిలోల కట్ల చేపలను ధ్వంసం చేశారు. అవసరమైన ఫుడ్ బిజినెస్ రిజిస్ట్రేషన్ పొందాలని వ్యాపారికి ఆదేశాలు జారీ చేశారు.
రాంనగర్ మార్కెట్లో విస్తృత తనిఖీలు
ముషీరాబాద్‌లోని రాంనగర్ చేపల మార్కెట్లో పలు వ్యాపార సంస్థల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. హరి ఫిష్ కంపెనీ, అర్జున్ ఫిష్ మార్ట్, బాలకృష్ణ ఫిష్ మార్ట్, సీఎన్ఆర్ ఎంటర్‌ప్రైజెస్, జేడీబీ ఫిష్ మర్చంట్ తదితర దుకాణాలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.15 వేల విలువైన 150 కిలోల చేపలను ధ్వంసం చేశారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) లైసెన్సులు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న సంస్థలకు నోటీసులు జారీ చేశారు.
బిన్సన్స్ ఫిషరీలో 65 కిలోల కుళ్లిన చేపలు
అదేవిధంగా లక్ష్మీనారాయణ హోల్‌సేల్ ఫిష్ షాప్, ఎస్‌కేకే ఫిష్ మర్చంట్స్, కేఎల్‌ఎం ఫిష్ మర్చంట్స్, ఎస్‌వీఆర్ హోల్‌సేల్ ఫిష్ మర్చంట్, జీబీకే ఫిష్, బిన్సన్స్ ఫిషరీల్లోనూ తనిఖీలు నిర్వహించారు. ఆయా వ్యాపారులు అవసరమైన ఫుడ్ సేఫ్టీ లైసెన్సులు పొందాలని అధికారులు సూచించారు.ఎస్‌కేకే, కేఎల్‌ఎం ఫిష్ మర్చంట్స్ వద్ద రూ.5,400 విలువైన 70 కిలోల కుళ్లిన చేపలను గుర్తించి ధ్వంసం చేశారు. ఎస్‌వీఆర్ హోల్‌సేల్ ఫిష్ మర్చంట్ వద్ద రూ.1,400 విలువైన 35 కిలోల కుళ్లిన తిలాపియా చేపలను, జీబీకే ఫిష్ వద్ద రూ.3 వేల విలువైన 30 కిలోల కుళ్లిన చేపలను తొలగించారు.ముఖ్యంగా బిన్సన్స్ ఫిషరీలో రూ.8,450 విలువైన 65 కిలోల పాడైపోయిన చేపలను గుర్తించి ధ్వంసం చేశారు. ఈ సంస్థ ఎలాంటి లైసెన్స్ లేకుండా, అపరిశుభ్ర వాతావరణంలో వ్యాపారం నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
కొనసాగనున్న తనిఖీలు
ఈ తనిఖీల్లో టీజీ సేఫ్ ఫుడ్ వింగ్ అధికారులు, వెటర్నరీ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. చేపల విక్రయదారులు తప్పనిసరిగా ఆహార భద్రతా నిబంధనలు పాటించాలని, పరిశుభ్రమైన వాతావరణంలో చేపలను నిల్వ చేసి విక్రయించాలని అధికారులు ఆదేశించారు. లైసెన్సులు లేకుండా వ్యాపారాలు నిర్వహించరాదని హెచ్చరించారు. ప్రజలకు సురక్షితమైన ఆహారం అందించడమే లక్ష్యంగా నగరంలోని చేపల మార్కెట్లలో తనిఖీలు కొనసాగనున్నాయి.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


